AP Tourism Investments : ఏపీ టూరిజంలో రూ.1217 కోట్ల పెట్టుబడులు, 8 సంస్థలతో ఒప్పందాలు
AP Tourism Investments : ఏపీ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు చేసుకుంది. దీంతో టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పించనున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
AP Tourism Investments : ఏపీ పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తుంది. పర్యాటక రంగానికి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారన్నారు. దీంతో టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ సదస్సులో అరకు చలి ఫెస్టివల్ బ్రోచర్ విడుదల చేశారు.
"ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు జరిగింది. త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తాం. ఎంటర్టైన్మెంట్, టూరిజానికి రియల్ హబ్ గా విశాఖపట్టణం మారుతుంది. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాం. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం"- మంత్రి కందుల దుర్గేష్
8 సంస్థలతో ఒప్పందం- రూ.1217 కోట్ల పెట్టుబడులు
- అట్మాస్పియర్ కోర్ - విశాఖ, అమరావతి, తిరుపతి- రూ.1,000 కోట్లు
- సుమియాగ్రి - విశాఖ, గుంటూరు - రూ.50 కోట్లు
- ఎవరెస్టు ఎంటర్ ప్రైజెస్- విశాఖ - రూ. 07 కోట్లు
- రాయల్ పామ్స్ - చీరాల - రూ.30 కోట్లు
- రిప్పిల్స్ అండ్ కో- అల్లూరి సీతారామరాజు జిల్లా- రూ.100 కోట్లు
- బ్లూబే ఇన్ ఫ్రా- భోగాపురం -రూ.18 కోట్లు
- హోటల్ ఎస్ పార్క్ - బాపట్ల - రూ.7 కోట్లు
- డాల్ఫిన్ ఓషన్ క్రూయిజ్ - విశాఖ - రూ.5 కోట్లు
సోమవారం విశాఖలో జరిగిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమ్మిట్‌లో 150 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ...యారాడ బీచ్‌లో హోటళ్లు, రిసార్ట్స్ ప్రాజెక్ట్ కోసం అట్మాస్పియర్ కోర్ రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. విశాఖపట్నం, అమరావతిలోని హోటళ్లకు సుమియాగ్రీ రూ.50 కోట్లు, విల్లాలు కన్వెన్షన్ సెంటర్ కోసం రిప్పల్ అండ్ కో రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.
ఏపీ నూతన పర్యాటక విధానం ద్వారా జీఎస్‌టీ, విద్యుత్, మున్సిపల్ కార్పొరేషన్ ఛార్జీలలో సంస్కరణలు తీసుకోస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రకృతి సౌందర్యం, పర్యావరణ అనుకూలతకు ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
క్రూయిజ్ టూరిజం
క్రూయిజ్ టూరిజం త్వరలో ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. పుదుచ్చేరి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం ఇది నిలిచిపోయిందన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించి, ఈ సదుపాయాన్ని తిరిగి ప్రారంభించాలని కోరామని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు.
అడ్వెంచర్ టూరిజంతో పాటు పిలిగ్రమ్ టూరిజంను ఏకకాలంలో చేపడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు. హాస్పిటాలిటీ రంగం నుంచి చాలా కాలంగా ఉన్న అభ్యర్థన... రాత్రిపూట హోటల్స్ / ఫుడ్ స్టాల్స్ కార్యకలాపాలను అనుమతించే ప్రణాళికలను మంత్రి ప్రకటించారు. పెట్టుబడిదారులు తమ ప్రతిపాదనలను సమర్పిస్తే వాటిని త్వరగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్టార్ హోటళ్లకు మద్యం బార్ లైసెన్స్ ఫీజును రూ.66 లక్షల నుంచి రూ.20 లక్షలకు తగ్గించాలని సీఎం చంద్రబాబును కోరినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.
20 లక్షల ఉద్యోగవకాశాలు
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ...పర్యాటక రంగంలో అనేక కీలక పరిణామాలను హైలైట్ చేశారు. విజయవాడలో తొలి ఇన్వెస్టర్ సమ్మిట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సమ్మిట్ కాకుండా తిరుపతిలో మూడో సమ్మిట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుమన్నారు. వచ్చే ఐదేళ్లలో పర్యాటక రంగంలో 2 మిలియన్ల ఉద్యోగావకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అజయ్ జైన్ చెప్పారు.