AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
AP TG Rains : నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

AP TG Rains : ఏపీ, తెలంగాణలో నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో....ఆదివారం శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం బలహీనపడుతుందని వెల్లడించింది. అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటలు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇవాళ హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతుంది.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. మెదక్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు కురిసే ఉందని తెలిపింది.
గోదావరికి భారీగా వరద ప్రవాహం
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.2 అడుగులు చేరుకుంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 13.7 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహాన్ని విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సంబంధిత కథనం