AP TET Results 2024 : నేడు ఏపీ టెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోవచ్చు..!
AP TET Results 2024 : ఇవాళ ఏపీ టెట్ - 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫైనల్ కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల ప్రకటనకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
నేడు ఏపీ టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 21న టెట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పరీక్షల ఫైనల్ కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ… ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది.
ఏపీ టెట్ పరీక్షలు 17 రోజల పాటు జరిగాయి. ప్రతి రోజు 2 విడతలుగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
త్వరలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అర్హత సాధించేందుకు లక్షలాది మంది అభ్యర్థులు గత మూడు నెలలుగా శ్రమిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటంతో టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో పాత అభ్యర్థులతో పాటు కొత్త అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఫలితాలు విడుదలైన వెంటనే… అర్హత సాధించే అభ్యర్థులు డీఎస్సీ కోసం సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీ టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి…
Step 1 : టెట్ రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Step 2 : హోం పేజీలో కనిపించే AP TET Results - 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : మీ వివరాలను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ టెట్ స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
Step 4 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఈ వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్…!
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల కానుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు.
అయితే టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అధికారులు అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థులకు భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. అధికారికంగా విద్యాశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఖాళీలపై స్పష్టత రానుంది.