AP TET Applications 2024 : ఏపీ టెట్(జులై 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అంతకంటే ముందే ఫీజు చెల్లింపు ప్రాసెస్ షురూ అయింది. ఇవాళ్టి నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో అభ్యర్థులు ఫీజు చెల్లించుకోవచ్చు.
ఏపీ టెట్ దరఖాస్తుల ప్రక్రియ జులై 04వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 17వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాలి.
ఏపీ టెట్ ఆన్‌లైన్ మాక్ టెస్టులు జులై 16 నుంచి అందుబాటులో రానున్నాయి. https://aptet.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ఈ మాక్ టెస్టులను రాసుకోవచ్చు. ఇక జులై 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు 5వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై…. 20వ తేదీ వరకు జరుగుతాయి. ఆగస్టు 25న టెట్ ఫైనల్ కీ అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 30న ఫలితాలను ప్రకటించనున్నారు.
ఏపీ టెట్ సిలబస్ గురించి అభ్యర్థులు అపోహలకు గురి కావొద్దని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. గత ఫిబ్రవరి 2024లో జరగిన టెట్ పరీక్ష సిలబస్ ఆధారంగా పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించారు.
టెట్ నిర్వహణలో పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు.
టెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌తోనే సన్నద్ధం కావాలని సూచించారు.
ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సరైన సిలబస్‌తో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. పూర్తి సిలబస్ వెబ్ సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వివరించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా డిఎస్పీలో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఆదేశించారు.టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీ నేపథ్యంలో అధికారులతో పలు అంశాలపై చర్చించారు.