AP TET Hall Tickets 2024 : అలర్ట్... ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP TET Hall Tickets Download 2024 : ఏపీ టెట్ - 2024 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. నవంబర్ 2వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు టెట్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. శనివారం రాత్రి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి.అక్టోబర్ 20వ తేదీ వరకు జరుగుతాయి.
ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజుల పాటు జరుగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
ఏపీ టెట్ హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- ఏపీ టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి Candidate ID, పుట్టిన తేదీతో పాటు Verfication Code ను ఎంట్రీ చేయాలి.
- లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ ఉండాల్సిందే. భవిష్యత్ అవసరాల కోసం కూడా భద్రంగా ఉంచుకోవాలి.
భారీగా దరఖాస్తులు...
ఈసారి టెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్ (ప్రత్యేక విద్య) పేపర్ 1- బికు 2,662 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ విభాగంలో పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 1,04,788 మంది అప్లికేషన్ చేసుకున్నట్లు పేర్కొంది.
నవంబర్ 2న టెట్ ఫలితాలు...
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.... అక్టోబర్ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5 నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2న ఏపీ టెట్ - 2024 తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఇక టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,347 టీచర్ల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఈ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే జూలై నెలలో టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
డీఎస్సీ పరీక్షలో టెట్ స్కోరు కీలకంగా ఉంటుంది. వెయిటేజీ ఉన్న కారణంతో టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో కలిసివస్తుంది. కాబట్టి డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులు టెట్ లో మంచి స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇక టెట్ పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ విద్యాశాఖ అధికారులు మాక్ టెస్టులు రాసుకునే అవకాశం కల్పించారు. వీటిని కూడా టెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రాసుకోవచ్చు.