ఏపీ, తెలంగాణలో చల్లబడిన వాతావరణం-నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు-ap telangana weather update heavy rains expected in several districts tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ, తెలంగాణలో చల్లబడిన వాతావరణం-నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో చల్లబడిన వాతావరణం-నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో వాతావరణం కూల్ అయింది. పలు జిల్లాల్లో నేడు, రేపు తేలికపాట నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో చల్లబడిన వాతావరణం-నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. నేడు, రేపు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలోని అన్నమయ్య, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.

అనంతపురంలో భారీ వర్షాలు

అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. బూదగవి వంక మరువ పొంగుతోంది. విడపనకల్లు- ఆర్.కొట్టాల, పెంచులపాడు- పొలికి, పాల్తూరు-మల్లాపురం, ఉరవకొండ-ఉండబండ, గ్రామాల మధ్య వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఏపీ-కర్ణాటక మధ్య రాకపోకలకు అంతరాయం

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామం వద్ద కట్రవంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఏపీ, కర్ణాటక మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎగువన భారీగా వర్షం పడడంతో వాగులోకి వరద నీరు పోటెత్తుతుంది. తాత్కాలిక వంతెనపై వరద నీరు పోటెత్తడంతో ఒకట్రెండు రోజులు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

తెలంగాణలో కూల్ వాతావరణం

తెలంగాణలో వాతావరణం కూల్ అయింది. ఉదయం ఎండలు ఠారెత్తించగా..సాయంత్రానికి పలు జిల్లాల్లో జల్లులు పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 30-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ లో వర్షం

హైదరాబాద్‌లోని కొండాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్ , సికింద్రాబాద్, ఎల్బీనగర్ లో భారీ వర్షం పడింది. వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

మరో పది రోజుల్లో నైరుతి

మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 22న అండమాన్‌ను తాకిన నైరుతి.. 26న శ్రీలంకను తాకొచ్చని వాతావరణ శాఖ భావించింది. అయితే పది రోజుల ముందుగానే రుతుపవనాలు శ్రీలంకలోకి ప్రవేశించాయి. దీంతో ఈ నెల 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం