Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడుతున్న రహదారులు, రోజుకు సగటున 21 మంది మృత్యువాత!
Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రక్తమోడుతున్నాయి. 2022 రహదారి ప్రమాదాల లెక్కల ప్రకారం.. హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకోని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున 21 మంది మరణించారు. మొత్తంగా 7,535 మంది మృత్యువాత పడ్డారు.
Road Accidents : చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంటాయి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తతో పాటు జాగ్రత్తలు తప్పనిసరి. హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం వాహన ప్రయాణాల్లో అత్యంత ముఖ్యం. నిర్లక్ష్యంగా వీటిని విస్మరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2022 రోడ్డు ప్రమాదాల గణాంకాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ గణాంకాల్లో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడాయి. హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకోని కారణంగా ఏపీ, తెలంగాణలో 2022లో 7,535 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,439 మంది గాయపడ్డారు.
రోజుకు 21 మంది
2022 రోడ్డు ప్రమాద గణంకాల ప్రకారం... తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున 21 మంది మరణించగా, 48 మంది గాయపడ్డారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం కారణంగా దేశవ్యాప్తంగా 50,029 మంది మృతి చెందారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 6.08 శాతం మంది, తెలంగాణలో 5.92 శాతం మరణించారు. సీటు బెల్టు ధరించని కారణంగా దేశంలో 16,715 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఏపీలో 5.35 శాతం మంది, తెలంగాణలో 3.79 శాతం మంది ఉన్నారు. 2022 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా హెల్మెట్లు ధరించకపోవడం వల్ల 50,029 మంది మరణించగా... వీరిలో 35,692 మంది వాహన చోదకులు, 14,337 మంది ప్రయాణికులు మరణించారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం కారణంగా 16,715 మంది మరణించగా... వీరిలో 8,384 మంది డ్రైవర్లు, 8,331 మంది ప్రయాణికులు చనిపోయారు.
40 శాతం మంది 18-35 ఏళ్ల మధ్య వయస్కులే
2021, 2022లో ఏపీ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 40 శాతానికి పైగా 18-35 ఏళ్ల మధ్య వయస్కులే. రోడ్డు ప్రమాదాల బాధితుల్లో ఎక్కువగా యువకులు అతివేగంగా కారణంగా మృతి చెందారని రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక తెలిపింది. 18-35 సంవత్సరాల వయస్కులు మొత్తం 3,571 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారు. 2022లో నమోదైన మొత్తం రోడ్డు ప్రమాదాలలో ఇది 43 శాతంగా ఉంది. 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో (8,186) 41 శాతం మంది బాధితులు (3,410) 18-35 ఏళ్ల మధ్య ఉన్నవారేనని నివేదిక ప్రకారం తెలుస్తోంది. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా యువకులు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొంది. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 24 శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. 2021లో 381 మంది మైనర్లు(18 ఏళ్లలోపు) మరణించగా...ఈ సంఖ్య 2022లో 474కి పెరిగింది.
ఏపీలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు
2022లో విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య 46 శాతం పెరిగాయి. 2021తో పోలిస్తే 2022లో వైజాగ్ లో రోడ్డు ప్రమాదాల మరణాలు 3 శాతం తగ్గాయి. రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య 50 నగరాల్లో... విజయవాడ 13వ స్థానంలో, వైజాగ్ 18వ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గాయి. అయితే రోడ్డు ప్రమాద మరణాలు 2021తో పోలిస్తే 2022లో పెరిగాయి. రోడ్డు ఇంజినీరింగ్ లోపం, జంక్షన్ డిజైన్ సరిగా లేకపోవడం, సరైన సంకేతాలు లేకపోవడం, అతివేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.