AP TG Rains : ఏపీ, తెలంగాణలో సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇవాళ పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతుంది. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదేశ్, యానాంలలో నైరుతి మరియు దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి.
సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు సూచించారు.
అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంటనష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు.
అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల జరిగిన పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించామని అధికారులు సీఎంకు వివరించారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని...రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. అనంతరం 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. అకాల వర్షాలు రైతులకు ఆవేదన మిగిల్చాయి. పలు జిల్లాల్లో పంటలు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. వడగండ్లు, ఈదురు గాలుల కారణంగా వరి, మామిడి, మొక్కజొన్న...రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల, వడగండ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాలలో 336 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 321 ఎకరాల మొక్కజొన్న, 15 ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. చొప్పదండి రామడుగు, కరీంనగర్ కొత్తపల్లి మండలాలలో 213 మంది రైతులకు సంబంధించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇప్పటికే సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే...ఇప్పుడు అకాల వర్షాలు నిండాముంచాయి. నీటి ట్యాంకర్లను తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటుంటే...వర్షాలు పంటలను పూర్తిగా నేలపాలు చేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మామిడి కాయ దశలో ఉండడంతో వడగండ్ల వర్షంతో మామిడి కాయలన్నీ రాలి నేలరాలిపోయాయని రైతులకు ఆవేదన చెందుతున్నారు.
సంబంధిత కథనం