AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రేపు ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు
AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రేపు ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రేపు ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక రేపు(మార్చి 25) ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
రేపు(మంగళవారం) ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురంమన్యం జిల్లాలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6, కాకినాడ జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 6, ఏలూరు జిల్లాలో 2, ఎన్టీఆర్ జిల్లా 3 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష
వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు.
ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించారలన్నారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పశువుల కోసం గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలన్నారు. పాఠశాలల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో పర్యవేక్షించాలని ఆదేశించారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్
తెలంగాణలో రేపు(మంగళవారం) పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాత్రి 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. తదుపరి 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తదుపరి క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
సంబంధిత కథనం