AP TG Farmers Welfare : పెట్టుబడి సాయం కోసం రైతన్న ఎదురుచూపులు- అన్నదాత సుఖీభవ, రైతు భరోసా అమలు ఎప్పుడో?-ap telangana farmers waiting for annadata sukhibhava rythu bharosa scheme implementation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Farmers Welfare : పెట్టుబడి సాయం కోసం రైతన్న ఎదురుచూపులు- అన్నదాత సుఖీభవ, రైతు భరోసా అమలు ఎప్పుడో?

AP TG Farmers Welfare : పెట్టుబడి సాయం కోసం రైతన్న ఎదురుచూపులు- అన్నదాత సుఖీభవ, రైతు భరోసా అమలు ఎప్పుడో?

Bandaru Satyaprasad HT Telugu
Dec 31, 2024 12:03 AM IST

AP TG Farmers Welfare : పీఎం కిసాన్ పేరిట రైతులకు కేంద్రం పెట్టుబడ్డి సాయం అందిస్తుంది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రైతుల పెట్టుబడి సాయం పథకాల అమలుపై ఇంకా సమాలోచనలు చేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ, రైతు భరోసా పథకాల అమలు కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.

పెట్టుబడి సాయం కోసం రైతన్న ఎదురుచూపులు- అన్నదాత సుఖీభవ, రైతు భరోసా అమలు ఎప్పుడో?
పెట్టుబడి సాయం కోసం రైతన్న ఎదురుచూపులు- అన్నదాత సుఖీభవ, రైతు భరోసా అమలు ఎప్పుడో?

AP TG Farmers Welfare : పీఎం కిసాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.6 వేలు రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తుంది. మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. పీఎం కిసాన్ నిధులు కలిగి ఏటా రూ.20 వేలు అని ఏపీలో, రూ.15 వేలు అని తెలంగాణలో ప్రస్తుత అధికార పార్టీలు ఎన్నికల హామీల్లో ప్రకటించాయి. హామీలు ప్రకటన ముందు పార్టీలు..అమల్లో వెనుకడుగు వేస్తున్నాయి. ఏపీలో 'అన్నదాత సుఖీభవ' పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలె వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు...పెట్టుబడి సాయంపై ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ప్రకటించారు.

yearly horoscope entry point

గతంలో పంటల సాగుకు ముందు రైతు భరోసా పేరిట రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వచ్చి ఆరు నెలలు దాటినా రైతులకు ఇస్తామన్న రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నోచుకోలేదు. దీంతో చాలా మంది రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రబీ సాగు ఆశాజనకంగా ఉంది, సకాలంలో వర్షాలు కురవడంతో సాగు కోసం రైతన్న పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం రైతులకు సకాలంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి, పంటలకు మరింత ఊతం ఇవ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఖరీఫ్ ముగిసి రబీ వస్తున్నా...ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులకు ఆ పథకం వర్తింపచేయాలంటే భారీగా నిధులు కావాలని, కానీ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4500 కోట్లు మాత్రమే కేటాయించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో రైతు భరోసా

ఇక తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 10 వేలు రెండు విడతల్లో ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటుతున్నా... ఇంకా విధివిధానాల కసరత్తే జరుగుతోంది. రుణమాఫీ, సన్న ధాన్యం బోనస్ తో రైతులకు ఉపశమనం కలిగించినా... రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా విధి విధానాలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ఇప్పటికే ప్రతిపక్షాలు, నిపుణులు, రైతుల సలహాలు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ కూడా చేసింది. రైతు భరోసాను రైతు బంధు మాదిరిగా భూరికార్డుల ఆధారంగా కాకుండా.. సాగు భూమి లెక్కల ఆధారంగా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో రైతు బంధుకు పరిమితి లేదు. కొండలు, గుట్టలు, రహదారులు, అధికారులు, వ్యాపారులు, ఇలా ఎవరికైనా రైతు బంధు జమ అయ్యేది. కాంగ్రెస్ సర్కార్ అర్హులైన వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇన్ని ఎకరాలకు రైతు భరోసా అందించాలని పరిమితి విధించనుంది. 5 నుంచి 10 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో రైతుబంధు పట్టా భూములకే వచ్చింది. దీంతో అసైన్డ్ భూములు ఉన్నవారు నష్టపోయారు. కౌలు రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇవన్నీ గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలో రైతు భరోసా అందించాలని రైతులు కోరుతున్నారు.

Whats_app_banner