AP Teachers Transfers : వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు-సీనియారిటీ జాబితాపై డీఈవోలు కసరత్తు
AP Teachers Transfers : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. వేసవి సెలవులలో బదిలీలు, పదోన్నతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఫిబ్రవరిలోనే విద్యాశాఖకు పంపించేలా జిల్లాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

AP Teachers Transfers : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతల ప్రక్రియ ప్రారంభమైంది. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాను తయారు చేసే కసరత్తులో జిల్లాల విద్యాశాఖ అధికారులు తలమునకలై ఉన్నారు. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఫిబ్రవరిలోనే విద్యాశాఖకు పంపించేలా జిల్లాల విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం చేసిన ఉపాధ్యాయ బదిలీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. అప్పటి నుంచి ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. అనేక అడ్డంకులు నేపథ్యంలో బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.
వేసవి సెలవుల్లో బదిలీలు
వచ్చే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేస్తున్నారు. ఈ కసరత్తును ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారి కేడర్‌లో ఉన్న డీఈవోలను నిర్వహిస్తారు. ఆయా జిల్లాల్లో సీనియారిటీ జాబితాను తయారు చేయడానికి వివిధ కేడర్ ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు.
ఒక్కో బృందానికి ఇద్దరు చొప్పున ఏర్పరచుకుని ఎలాంటి పొరపాట్లు లేకుండా చూస్తు్న్నారు. అనంతరం డీఈవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో అప్లోడ్ ప్రక్రియ చేస్తారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఐఎస్) ద్వారా ఉపాధ్యాయులు వ్యక్తిగత, సర్వీసుకు సంబంధించిన సమగ్ర వివరాల ఆధారంగా జాబితాను తయారు చేస్తున్నారు.
1989 సంవత్సరం డీఎస్సీ నుంచి 2018 సంవత్సరం డీఎస్సీ వరకు కేడర్ వారీగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత, డీఎస్సీ పోటీ పరీక్షలో లభించిన మార్కులు తదితర వివరాలను అన్ని మండలాల్లో మండల విద్యా శాఖ అధికారులు (ఎంఈవో) తొలుత సేకరించి, డీఈవో కార్యాలయానికి పంపుతారు. వివిధ డీఎస్సీ నియామకాలు, 610 నియామకాలు, అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్రాల బదిలీలలో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు.
సీనియారిటీ ప్రకారం జాబితాలు
ఆ వివరాలను డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రికార్డుల ఆధారంగా మరోసారి పర్యవేక్షిస్తారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం పోస్టుల సీనియారిటీ ప్రకారం జాబితాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
అయితే వీటి గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ, రాష్ట్ర స్థాయిలోని విద్యాశాఖ అధికారులు పట్టించుకోవటం లేదని వివిధ జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో సిబ్బంది చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో సమస్యలు తలెత్తున్నప్పుడు మాన్యువల్‌గా వివరాల ఎంట్రీ, పరిశీలన వంటి పనులను డీఈవో కార్యాలయాల్లో చేస్తున్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 ద్వారా ప్రాథమిక పాఠశాలలోని మూడు, నాలుగు, ఐదు తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ జీవోని రద్దు చేసి, పాత పద్దతిలోనే పాఠశాలల వర్గీకరణ చేపట్టింది. దీంతో ఉపాధ్యాయ బదిలీలో కూడా, వర్గీకరించిన పాఠశాలల వారీగానే ఉండనుంది. అయితే సీనియారిటీ జాబితాలు జిల్లాలు వారీగా పూర్తి అయితే, వాటిని రాష్ట్ర విద్యాశాఖకు పంపుతారు. అప్పుడు ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం