Telugu News  /  Andhra Pradesh  /  Ap State Police Recruitment Board Declared Results Of Constable Recruitment Preliminary Written Test
పోలీస్‌ నియామక పరీక్షల ప్రాథమిక ఫలితాల విడుదల
పోలీస్‌ నియామక పరీక్షల ప్రాథమిక ఫలితాల విడుదల

AP Police Recruitment Results : కానిస్టేబుల్ పరీక్షల్లో 95,208మంది ఉత్తీర్ణత…

05 February 2023, 11:12 ISTHT Telugu Desk
05 February 2023, 11:12 IST

AP Police Recruitment Results ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ నియామకాల ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 4,59,182 మంది పరీక్షలకు హాజరైతే 95,208మంది అర్హత సాధించారు. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు చేపడుతుండటంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 22వ తేదీన ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.

AP Police Recruitment Results ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబందించి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సివిల్‌ కానిస్టేబుళ్లతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 6500పైగా ఉద్యోగాలను పోలీస్ శాఖలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 95,208మంది అర్హత సాధించారు.

కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 40శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. 200మార్కులకు ఓసీ అభ్యర్థులు 80మార్కులు సాధించిన వారిని తదుపరి పరీక్షలకు అర్హులుగా నిర్ణయించారు. బీసీ అభ్యర్థులకు 35శాతం మార్కుల్ని కటాఫ్‌గా నిర్ణయించారు. 200మార్కులకు 70మార్కులు వచ్చిన వారిని అర్హులుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 30శాతం కటాఫ్‌గా నిర్ణయించారు. 60 మార్కులు వచ్చిన వారిని మిగిలిన దశలకు అర్హులుగా ప్రకటించారు.

ప్రాథమిక పరీక్షల్ని నిర్వహించిన తర్వాత ప్రిలిమినరీ కీను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై 2261 అభ్యంతరాలు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. వచ్చిన అభ‌్యంతరాలపై అయా సబ్జెక్టు నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 3 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు ప్రకటించారు. తుది సమాధానాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు.

ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్కాన్‌ చేసిన ఓఎంఆర్‌ షీట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకు సంబందించిన అప్డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ను పరిశీలించాలని సూచించారు. రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్ధులకు రెండవ దశ అప్లికేషన్లను ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 20వతేదీ సాయంత్రం ఐదు గంటలకు వరకు అనుమతించనున్నారు. దేహదారుఢ్యం, శారీరక సామర్థ్య పరీక్షలకు రెండవ దశ దరఖాస్తును తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 94414 50639, 91002 03323 నంబర్లను సంప్రదించాలని బోర్డు ఛైర్మన్ సూచించారు.