AP Stamps and Registrations: ఏపీలో మొరాయించిన సర్వర్లు, నిలిచిన రిజిస్ట్రేషన్లు… గంటల తరబడి ఎదురు చూపులు-ap stamps and registration servers stalled for hours public face inconvenience ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Stamps And Registrations: ఏపీలో మొరాయించిన సర్వర్లు, నిలిచిన రిజిస్ట్రేషన్లు… గంటల తరబడి ఎదురు చూపులు

AP Stamps and Registrations: ఏపీలో మొరాయించిన సర్వర్లు, నిలిచిన రిజిస్ట్రేషన్లు… గంటల తరబడి ఎదురు చూపులు

Sarath Chandra.B HT Telugu
Published Feb 19, 2025 04:26 PM IST

AP Registrations: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలన్నీ అందిస్తున్నామని చెప్పుకునే ఏపీలో స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ సర్వర్లు మొరాయిస్తుండటంతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి.బుధవారం గంటల పాటు సర్వర్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.దీంతో క్రయ, విక్రయాల కోసం వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి.

విజయవాడ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జనం పడిగాపులు
విజయవాడ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జనం పడిగాపులు

AP Stamps and Registrations: ఆంధ్రప్రదేశ్‌ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడు అందుబాటులో ఉంటాయో, ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితిలో ఆ శాఖ నడుస్తోంది. బుధవారం ఉదయం సరిగ్గా రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యే సమయానికి సర్వర్లు ఆగిపోయాయి. దీంతో క్రయ, విక్రయాలు, ఇతర రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు. ఐదు పది నిమిషాల్లో సర్వర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పినా అవి గంటల తరబడి పనిచేయలేదు. దీంతో లావాదేవీల కోసం వచ్చిన వారు ఎదురు చూడక తప్పలేదు.

ఆర్ధిక సంవత్సరం చివరి నెల కావడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం కోసం కసరత్తు జరుగుతున్న సమయంలో సర్వర్లు మొరాయించాయి. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పెంచడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయార్జనపై సమీక్ష జరిగింది. అదే సమయంలో ఆ శాఖ సర్వర్లు నిలిచిపోవడంతో జనం విసుగు చెందారు. కనీసం ఎప్పుడు రిజిస్ట్రేషన్లను పునరుద్దరిస్తారో కూడా చెప్పలేకపోయారు.

తమ శాఖలో ఆన్‌లైన్‌ సర్వర్లు ఎప్పుడు, పనిచేస్తాయో, ఎప్పుడు మొరాయిస్తాయో ఎవరికి తెలియదని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులే చెబుతున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు సాక్షులతో కలిపి నలుగురు అవసం అవుతారు. క్రయ, విక్రయదారులతో పాటు మరో ఇద్దరు సాక్షులు రిజిస్ట్రేషన్‌లో ఉంటారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనంతో రద్దీగా మారాయి.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించడంతో నెలకొన్న సమస్యను రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా దృష్టికి వెళ్లడంతో మాన్యువల్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సూచనలు అందాయి. దీంతో ఉదయం 11 గంటలకు నిలిచిపోయిన లావాదేవీలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పునరుద్ధరించారు.

రద్దీకి అనుగుణంగా లేని సర్వర్లు..

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ సేవల్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో లావాదేవీలు అధికంగా జరిగే సమయంలో ఒక్కసారిగా సర్వర్లు క్రాష్ అవుతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, స్టాంప్ పేపర్ల విక్రయాలు, ఆన్‌లైన్‌ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అందించే ఇతర లావాదేవీలు, సేవలతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ట్రాఫిక్‌కు అనుగుణంగా వాటి సామర్థ్యాన్ని పెంచుకోక పోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సర్వర్లు పనిచేయక పోతే ఏమి చేయాలనే విషయంలో స్పష్టత లేక పోవడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ స్థాయి అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. మాన్యువల్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసే సదుపాయం అందుబాటులో ఉన్నా దానిని వినియోగించుకోవడం లేదు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం