AP SSC Exams : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
AP SSC Exams : ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
AP SSC Exams : ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెన్త్ విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా బాగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు.
ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు సోమవారం నుంచి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ప్రశాంతంగా పరీక్షలు రాయండి - మంత్రి లోకేశ్
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. ఇన్నాళ్లు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇదని గుర్తుచేశారు. ప్రశాంతంగా ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్:
ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందబాటులోకి వచ్చాయి.
- మార్చి 17న (సోమవారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1.
- మార్చి 19 (బుధవారం) సెకండ్ లాంగ్వేజ్.
- మార్చి 21 (శుక్రవారం) ఇంగ్లీష్.
- మార్చి 22 (శనివారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1.
- మార్చి 24 (సోమవారం) మ్యాథమెటిక్స్.
- మార్చి 26 (బుధవారం) ఫిజికల్ సైన్స్.
- మార్చి 28 (శుక్రవారం) బయోలాజికల్ సైన్స్ పరీక్ష.
- మార్చి 29 (శనివారం) ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2, ఎస్‌సీసీ ఒకేషనల్ కోర్సు.
- ఏప్రిల్ 1 (మంగళవారం) సోషల్ స్టడీస్.
సంబంధిత కథనం