Ayyanna Patrudu : నాకు నమస్కారం చెప్పాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావటం లేదు- స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Speaker Ayyanna Patrudu On Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ అయ్యన్నపాత్రులు వ్యంగ్యంగా స్పందించారు. తనకు నమస్కారం చెప్పాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావటం లేదని సెటైర్లు వేశారు. శీతాకాల సమావేశాలకు అయినా జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. తనకు నమస్కారం చెప్పాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావటం లేదని అయ్యన్నపాత్రుడు అన్నారు. కనీసం నవంబర్ 11 నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు అయినా జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాలని, అప్పుడు తామిద్దరం కలిసి మాట్లాడుకుంటామని అన్నారు.
నర్సీపట్నంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై స్పందించారు. తనకు నమస్కారం చెప్పాల్సి వస్తుందనే భయం, సిగ్గుతోనే వైఎస్ జగన్ అసెంబ్లీకి రావటం లేదని ఎద్దేవా చేశారు. తాను స్పీకర్‌ను కనుక సభ్యులెవరు సభలోకి అడుగుపెట్టినా, సభ నుంచి వెళ్లిపోయినా తనకు నమస్కారం చేస్తారని, అది గౌరవంగా చేయాల్సిందనేనని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు కూడా నాకు నమస్కారం చేయాల్సి ఉంటుందని అన్నారు.
జగన్ కూడా సభలోకి వస్తే నమస్కారం సార్ అనాల్సి వస్తుందని అన్నారు. ఇలా వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు నాకు నమస్కారం చేయాల్సి వస్తుందనే సిగ్గుతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావటం లేదని అన్నారు. వైఎస్ జగన్ సరదాగా ఓసారి అసెంబ్లీకి రావాలన్నారు. వస్తే ఇద్దరం కలిసి ముచ్చటించుకుందాంటూ సెటైర్లు వేశారు.
నవంబర్ 11 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
నవంబర్ 11 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ సమావేశాలకు అయినా వైఎస్ జగన్ హాజరుకావాలని, అప్పుడు ఆయనతో మాట్లాడుతానని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం పూర్తి స్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్లీ మార్చిలో జరిగే వేసవికాల (బడ్జెట్) సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
అయితే గతంలో కూడా జగన్‌పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇలానే వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఎమ్మెల్యేకి ఉన్న అధికారాలన్ని ఉంటాయని అన్నారు. అలాగే ప్రతిపక్షనేత హోదాపై కూడా జగన్ రాసిన లేఖపై చట్టం తనపని తాను చేసుకుంటుందని, ఆయన లేఖ రాసినంత మాత్రానా ప్రతిపక్షనేత హోదా రాదని ఎద్దేవా చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం