AP TET 2024 Update : ఏపీ టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, పాఠశాల విద్యాశాఖ క్లారిటీ
AP TET 2024 Update : ఏపీ టెట్ పై పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదని పేర్కొంది. టెట్ అప్లై చేసుకునేందుకు ఆగస్టు 3 చివరి తేదీగా స్పష్టం చేసింది.

AP TET 2024 Update : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు జులై 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 3వ తేదీతో గడువు ముగియనుంది. దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.
మైనార్టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్
రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ను అందిచనున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ ఎం డి ఫరూక్ శుక్రవారం అమరావతి నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు,జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఏపీ- టెట్ 2024 కు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉర్దూ, తెలుగు మీడియం లో శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.ఈ శిక్షణ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) మైనార్టీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉచిత శిక్షణ కోసం మైనారిటీ విద్యార్థులు రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆయా కేంద్రాల ద్వారా శిక్షణ పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టెట్ ఎడిట్ ఆప్షన్
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు అవకాశం కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న టెట్ 2024 పరీక్ష దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చుకోడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది.
- అప్లికేషన్లను ఎడిట్ చేయడానికి అభ్యర్థులు ఏపీ టెట్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి “అప్లికేషన్ డిలీట్” ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ చివరలో వుండే “OTP” ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అభ్యర్థి దరకాస్తు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
- దాంతో మొదట అప్‌లోడ్ చేసిన అప్లికేషన్ డిలీట్ అవుతుంది. తరువాత పేపర్ చేంజ్ ఆప్షన్ కనబడుతుంది.
- పేపర్ చేంజ్ ఆప్షన్ దగ్గర “ఎస్/Yes “ మీద క్లిక్ చేయాలి. అందులో టెట్ పేపర్ల జాబితా కనబడుతుంది.
- అభ్యర్థి తాను మార్చుకోదలచిన పేపర్ / సబ్జెక్టును జాబితా నుంచి గుర్తించాలి.
- రెండోసారి ఎంపిక చేసుకున్న పేపర్ / సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్హతలు , మీడియం ఇతర వివరాలు అన్నిటిని దరఖాస్తులో పూర్తి చేసి దరఖాస్తును సరి చేసుకుని తిరిగి సబ్మిట్ చేయాలి.
- పేపర్ 2 ఏ - ఇంగ్లీష్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ పరీక్షా సమయంలో అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే 8 భాషలలో అభ్యర్థి తన ఫస్ట్ లాంగ్వేజ్ ని ఎంపిక చేసుకొని ఆ విభాగంలో వచ్చే 30 ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు .
- టెట్ 2024 అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సూచించారు.
సంబంధిత కథనం