AP Academic Calender: 232రోజుల పనిదినాల తో ఏపీ పాఠశాల వార్షిక విద్యా ప్రణాళిక, అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు
AP Academic Calender: ఏపీలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలన్నర తర్వాత వార్షిక విద్యా ప్రణాళికను ఖరారు చేశారు. గత మార్చి నుంచి ఎన్నకల కోడ్ అమల్లోకి రావడంతో అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనలో తీవ్ర జాప్యం జరిగింది.
AP Academic Calender: ఏపీలో ఎట్టకేలకు అకడమిక్ క్యాలెండర్ ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనలో తీవ్ర జాప్యం జరిగింది. పొరుగున ఉన్న తెలంగాణలో గత మేలో పాఠశాలలు తెరవక ముందే విద్యా ప్రణాళికను ఖరారు చేశారు. ఏపీలో ఎన్నికల కోడ్ రావడంతో జాప్యం జరిగింది.

రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఆగస్టులోగా స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలకు నిర్వహించాలని సూచించారు.
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు.
స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయ్ లెట్స్ నిర్వహణ మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు.
సిబిఎస్‌ఇ స్కూళ్లపై త్వరలో రూట్ మ్యాప్…
సిబిఎస్ఇ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేష్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి లోకేష్, విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు.
ఈ ఏడాది ఏపీలో పాఠశాలలకు 232 రోజులు పని దినా లుగా ప్రభుత్వం నిర్ణయించింది. సెలవులు 83 రోజులు రానున్నాయి.
- ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థ లకు దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు.
- మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇస్తారు.
- సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇస్తారు.