AP Sadarem Certificate : ఏపీలో సదరం క్యాంపులకు తాత్కాలిక బ్రేక్, తనిఖీల కారణంగా సర్టిఫికెట్ల పంపిణీ నిలిపివేత
AP Sadarem Certificate : ఏపీలో సదరం సర్టిఫికెట్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం క్యాంపుల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల కారణంగా జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
AP Sadarem Certificate : జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలు పూర్తైన తర్వాత సదరం సర్టిఫికెట్లు జారీచేస్తామన్నారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగా దివ్యాంగులకు ప్రభుత్వం పింఛన్ లు అందిస్తుంది.
సదరం సర్టిఫికెట్ పొందడం ఎలా?
శారీరక వైకల్యం, మానసిక లోపాలు, దృష్టి వైకల్యంతో పాటు ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ నిబంధనల ప్రకారం ఈ సర్టిఫికెట్ అందిస్తుంటారు. యాక్సిడెంట్లలో అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది.
సదరం సర్టిఫికెట్ వల్ల దివ్యాంగులు అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్, ఆర్టీసీ బస్సులు, రైళ్ల ప్రయాణాల ఛార్జీల్లో రాయితీలు, చిన్న తరహా పరిశ్రమ స్థాపనకు రుణాలు, సబ్సిడీ పొందేందుకు సదరం సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాంపులు నిర్వహిస్తూ ప్రభుత్వం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఇప్పటికీ వేలాది మంది దివ్యాంగులు ఈ సదరం సర్టిఫికెట్లు పొంది వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్నారు.
వైకల్యాన్ని ధ్రువీకరణ సదరం సర్టిఫికెట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్‌చేసుకోవచ్చు. ఏపీ సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుక్‌చేయడానికి అధికారిక వెబ్‌సైట్ https://sadarem.ap.gov.in/SADAREM/ ని సందర్శించాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, లింగం, వివాహ స్థితి, కులం, మతం సహా విద్యార్హత, రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.