CRDA Happynest :హ్యపీనెస్ట్‌ నిర్మాణం ఆలశ్యంపై రెరా ఆగ్రహం-ap real estate regulatory authority verdict on crdas amaravati happynest project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Ap Real Estate Regulatory Authority Verdict On Crdas Amaravati Happynest Project

CRDA Happynest :హ్యపీనెస్ట్‌ నిర్మాణం ఆలశ్యంపై రెరా ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 05:51 AM IST

CRDA Happynest గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యాపీనెస్ట్‌ నిర్మాణంలో జరుగుతుండటంపై రియల్‌ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతిలో రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రజలకు ఇళ్లను నిర్మించాలనే ప్రాజెక్టును సిఆర్‌డిఏ చేపట్టింది.

హ్యపీనెస్ట్‌ ప్రాజెక్టుపై రెరా కీలక తీర్పు
హ్యపీనెస్ట్‌ ప్రాజెక్టుపై రెరా కీలక తీర్పు

CRDA Happynest 2019 ఎన్నికలకు ముందు అమరావతి ప్రాంతంలో సిఆర్‌డిఏ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టు ఎన్నికల తర్వాత అనూహ్యం నిలిచిపోయింది. రికార్డు సమయంలో నిర్మాణానికి ముందే వేలంలో విక్రయాలు పూర్తైన హ్యాపీనెస్ట్‌ పథకంలో సొంతిళ్లను దక్కించుకునేందుకు ప్రవాస భారతీయులతో పాటు మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాల ప్రజలు పోటీలు పడ్డారు.ఆన్‌లైన్ బిడ్డింగ్ పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. అయితే ఆ తర్వాత వారికి కష్టాలు తప్పలేదు.

ట్రెండింగ్ వార్తలు

రాజధాని అమరావతిలో భాగంగా తలపెట్టిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు నిర్మించి ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగించడంలో సీఆర్‌డీఏ విఫలమైనందుకు వడ్డీ చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ స్తిరాస్థి వ్యాపార నియంత్రణ సంస్థ -ఏపీ రెరా కీలక తీర్పునిచ్చింది.

పిటిషనర్లు చెల్లించిన సొమ్ముపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రైమ్‌ లెండింగ్‌ రేటుతో పాటు మరో 2% కలిపి మొత్తం 16.15% వడ్డీ చెల్లించాలని పేర్కొంది. 2021 జూన్‌ 30 నుంచి ఫ్లాట్లను స్వాధీనపరిచేంత వరకు వడ్డీ సొమ్ము చెల్లించాలని తేల్చి చెప్పింది. రెరా సభ్యుడు చందు సాంబశివరావు ఈ మేరకు కీలక తీర్పునిచ్చారు. హ్యాపీనెస్ట్‌ నిర్మాణంలో జాప్యమేర్పడినందున తాము చెల్లించిన సొమ్ముకు వడ్డీ చెల్లించాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌పై మద్దినేని వెంకటసాయిబాబు, మరో 11 మంది రెరాను ఆశ్రయించారు.

ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేలా ఆదేశించాలని కోరారు. మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. వారి తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. ఒప్పందం ప్రకారం అపార్టుమెంటును 2021 డిసెంబరుకు అప్పగిస్తామన్నారని, ఇందులో సీఆర్‌డీఏ విఫలమైందని వివరించారు.

రిజిస్ట్రేషన్‌కు సమయం పొడిగించినంత మాత్రాన ఫ్లాటు యజమానుల హక్కులకు భంగం కలిగించడానికి వీల్లేదని రెరా ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొందని తెలిపారు. మరోవైపు సీఆర్‌డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ కాలాన్ని ఏపీ రెరా పొడిగించిందని తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గుత్తేదారును ఏర్పాటు చేసుకునే దిశలో సీఆర్‌డీఏ ముందుకెళుతోందని వివరించారు. సీఆర్‌డీఏ వాదనలను రెరా సభ్యుడు తోసిపుచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్‌డిఏ చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్ని ప్రభుత్వం నిలిపివేసింది. మిగిలిన ప్రాజెక్టులుప్రభుత్వం సొంతంగా చేపట్టినవి కావడంతో పెద్దగా చిక్కులు తలెత్తలేదు. హ్యపీనెస్ట్‌ పథకంలో సొంతింటి కల నెరవేర్చుకోడానికి సాధారణ ప్రజలు పెట్టుబడులు పెట్టడంతో సిఆర్‌డిఏ చిక్కుల్లో పడింది. మూడున్నరేళ్లకు పైగా ఒక్క అడుగు కూడా ప్రాజెక్టు పనుల్లో ముందడుగు సాధించలేకపోయింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం హ్యాపీనెస్ట్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో ప్రాజెక్టులో ప్రాజెక్టుల్లో ఇళ్లను కొనుగోలు చేసిన వారు నిండా మునిగిపోయారు.

WhatsApp channel