AP Ration Cards : రేషన్ కార్డులపై మరో అప్డేట్- త్వరలో కొత్త డిజైన్ కార్డులు, చంద్రన్న కానుకలు!-ap ration card update new design card giving in new govt chandranna kanuka revived ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Cards : రేషన్ కార్డులపై మరో అప్డేట్- త్వరలో కొత్త డిజైన్ కార్డులు, చంద్రన్న కానుకలు!

AP Ration Cards : రేషన్ కార్డులపై మరో అప్డేట్- త్వరలో కొత్త డిజైన్ కార్డులు, చంద్రన్న కానుకలు!

Bandaru Satyaprasad HT Telugu
Aug 14, 2024 03:55 PM IST

AP Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైసీపీ రంగులు, జగన్, వైఎస్ఆర్ ఫొటోలో ఉన్నాయని. వాటి డిజైన్లు మార్చి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అలాగే చంద్రన్న కానుకలు పథకాన్ని తిరిగి అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

రేషన్ కార్డులపై మరో అప్డేట్- త్వరలో కొత్త డిజైన్ కార్డులు, చంద్రన్న కానుకలు!
రేషన్ కార్డులపై మరో అప్డేట్- త్వరలో కొత్త డిజైన్ కార్డులు, చంద్రన్న కానుకలు!

AP Ration Cards : ఏపీలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల మార్పు చేర్పులు, కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. తాజాగా ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులను పార్టీ రంగుల్లో వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఫొటోలతో జారీ చేశారు. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రేషన్ డిజైన్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ…త్వరలోనే తుది డిజైన్ ను ఖరారు చేయనుంది. ఆ వెంటనే కార్డుల జారీ కోసం ప్రకటన వెలువడనుంది. అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట.. తప్పనిసరిగా మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవలే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. కొత్త కార్డులను డిజైన్ చేసే పనిలోనే ఉన్నామని చెప్పారు.

కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని…. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నామని నాదెండ్ల తెలిపారు. వివాహం చేసుకొని రేషన్ కార్డులో పేర్లు లేనివారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతామనిపేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులను తప్పకుండా జారీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పేర్లు నమోదు చేసుకోలేదో వారిని గుర్తిస్తామని మంత్రి నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే త్వరలోనే ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది.

మళ్లీ చంద్రన్న కానుకలు

ఏపీ సర్కార్ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వంలో అందించిన నిత్యావసరాలను తిరిగి అందిస్తామని తెలిపిన ప్రభుత్వం..తాజాగా మరో ప్రకటన చేసింది. 2014-2019 మధ్య పండుగల సందర్భంగా ఇచ్చిన కానుకలను తిరిగి అందించాలని నిర్ణయించింది. సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, రంజాన్‌ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రేషన్ దుకాణాల్లో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలను ఉచితంగా అందించేందుకు కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి ఏటా రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

రేషన్ కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ

గత టీడీపీ హయాంలో చంద్రన్న కానుకల్లో కిలో గోధుమ పిండి, అర కిలో బెల్లం, అర కిలో శనగపప్పు, అర కిలో కందిపప్పు, అర లీటరు పామాయిల్‌, 100 మి.లీ నెయ్యి అందించేవారు. రంజాన్‌ తోఫాలో 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 2 కిలోల చక్కెర, 100 మిల్లీ గ్రాముల నెయ్యి ఉచితంగా అందించేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న కానుకలను నిలిపివేసింది. ఏపీలో ప్రస్తుతం 1,48,43,671 తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, అప్పుడప్పుడూ గోధుమ పిండి, కందిపప్పు ఇస్తున్నారు. ఇకపై ప్రతి నెలా ఉచిత బియ్యంతో పాటు చక్కెర, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు, కందిపప్పు, తృణధాన్యాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే చంద్రన్న కానుకలను తిరిగి అందించాలన్నారు.

సంబంధిత కథనం