AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP Schools Holiday : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
AP Schools Holiday : ఏపీలోని పలు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు(బుధవారం) స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖాధికారి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం ఇంకా తగ్గనందున రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. వరదల కారణంగా చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. వరద బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నందున పాఠశాలలను నడపడం సాధ్యం కాదన్నారు. అందువల్ల బుధవారం కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలను పాటించనట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఏల్లూరు జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిగత చోట్ల పాఠశాలలు యథావిథిగా నడుస్తాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఏపీలో వర్షాలు
ఇప్పుడిప్పుడే వర్షాలు కాస్త తగ్గుతున్నాయన్న తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీకి మళ్లీ వర్ష సూచన చేసింది. సెప్టెంబర్ 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం చెబుతుంది. అల్పపీడనం బలపడేందుకు రుతుపవన ద్రోణులు అనుకూలంగా ఉన్నాయన్నాని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా, గుంటూర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వర్ష సూచన చేసింది.
సంబంధిత కథనం