JC Prabhakar Reddy Vs BJP : కూటమిలో కుంపట్లు, జేసీ వర్సెస్ బీజేపీ - ఫ్లైయాష్ నుంచి పార్క్ వరకూ!
JC Prabhakar Reddy Vs BJP : ఏపీలో కూటమి నేత మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఫ్లైయాష్ తో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. జేసీ పార్క్ లో న్యూ ఇయర్ వేడుకలపై బీజేపీ మహిళా నేతలు విమర్శలు, జేసీ కౌంటర్, బీజేపీ నేతల రీకౌంటర్లతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.
JC Prabhakar Reddy Vs BJP : ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ నేతలు యామినీ శర్మ, మాధవీ లత వ్యాఖ్యలు, వీరికి కౌంటర్ ఇస్తూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ఓ కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు మాత్రమే ప్రవేశం అని పెట్టారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రిలోని జేసీ పార్క్ వైపు మహిళలు ఎవరు వెళ్లకూడదని బీజేపీ నేతలు యామినీ శర్మ, నటి మాధవీ లత సూచనలు చేశారు. జేసీ పార్క్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగాయని, మహిళలకు సేఫ్ కాదన్నారు. అక్కడ అత్యంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని వీడియో విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మహిళలను అవమానించేలా మాధవీ లత మాట్లాడారని, జేసీ పార్కులో ఎలాంటి సంఘటనలు జరగడంలేదని అన్నారు.
జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ నేతలు హి*ల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో జేసీ పార్క్ లో మహిళలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తే బీజేపీ నేతలకేంటి సమస్య అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్నారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేతలు యామినీ శర్మ, సినీనటి మాధవీలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో పాటు అనంతపురంలో తన బస్సుల దగ్ధం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండవచ్చని అన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో వల్ల జరిగి ఉంటుందని ట్రావెల్స్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపిస్తున్నారు.
బీజేపీ నేతల కౌంటర్లు
జేసీ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలని హితవు పలికారు. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ... మాధవీలత మహిళల జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారన్నారు. ఎవరు బట్టలు వేసుకోవాలో జేసీ చెప్తారా? అంటూ నిలదీశారు. వైఎస్ జగన్‌పై ప్రేమ ఉంటే ఆయన దగ్గరికే వెళ్లవచ్చని సత్యకుమార్ అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నటి మాధవీలత ఘాటుగా స్పందించారు. సినిమాల్లో నటించేవారంతా వ్యభిచారులు కాదని, ప్రభాకర్ రెడ్డి వయసుకు తాను గౌరవం ఇస్తానన్నారు. అంతే తప్ప తాను ఎవరికీ భయపడనన్నారు. తనను కిడ్నాప్ చేసి హత్య చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డికి ఒళ్లంతా విషమే ఉందని మండిపడ్డారు. సినిమాల్లో కనిపించే ఆడవాళ్లు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అయితే... తాడిపత్రిలో ఉండే పతివ్రతలు సినీ రంగంలోకి రావొద్దని మాధవీలత సెటైర్లు వేశారు. తాడిపత్రిలోని మహిళలు మీ అందం, ఆలోచనలు, రూపాన్ని పెళ్లి తర్వాత మీ భర్తకు సమర్పించుకోండి అని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నేతలు ఎవరు తగ్గకపోవడంతో మరిన్ని ములుపులు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఫ్లైయాష్ వివాదం
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వృధాగా పోయే ఫ్లైయాష్ కోసం ఇద్దరు నేతలు పోటీ పట్టారు. దీంతో ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. తమ ప్రాంతంలోకి మీరేలా వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు జేసీ వర్గా్న్ని అడ్డుకోవడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. చివరకు సీఎం చంద్రబాబు దగ్గరికే పంచాయితీకి వెళ్లారు. చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.
ఆర్టీపీపీలో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ప్రతిరోజు సుమారు 5 వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 40 శాతం ఫ్లైయాష్ ను టెండర్ల ద్వారా వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. మిగిలిన 60 శాతం బరువైన బూడిదను పైపులు ద్వారా చెరువులోకి పంపుతారు. అలా వచ్చిన బూడిదకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని సిమెంట్ ఉత్పత్తిలో ఉపయోగించడంతో నేతలు పోటీ పడుతున్నారు. ఇలా చెరువులో వృధాగా పోయే బూడిద కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ఫ్లైయాష్ లారీలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో...ఘర్షణ వరకు వెళ్లింది. చివరకు సీఎం చంద్రబాబు కల్పించుకోవడంతో వివాదం ముగిసింది.
సంబంధిత కథనం