AP Police : ఏపీ పోలీసుల విచారణకు రాంగోపాల్ వర్మ.. కొనసాగుతున్న ఉత్కంఠ-ap police to question director ram gopal varma in social media case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Police : ఏపీ పోలీసుల విచారణకు రాంగోపాల్ వర్మ.. కొనసాగుతున్న ఉత్కంఠ

AP Police : ఏపీ పోలీసుల విచారణకు రాంగోపాల్ వర్మ.. కొనసాగుతున్న ఉత్కంఠ

Basani Shiva Kumar HT Telugu
Nov 19, 2024 10:15 AM IST

AP Police : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా దర్శకుడు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఆయన ఇవాళ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఆర్జీవీ విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ

ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ దర్శకుడు రాంగోపాల్ వర్మను విచారించనున్నారు. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని.. రాంగోపాల్‌ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈరోజు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్‌ వేయగా.. ఆయన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు ఠాణాలో ఏర్పాట్లు చేశారు. అయితే.. విచారణకు ఆర్జీవీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.

అసలు కేసు ఏంటీ..

డెరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై ఫిర్యాదు చేశారు. మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు.

మరోవైపు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కూడా రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌పై అనుచిక పోస్టులు పెట్టారని.. టీడీపీ రైతు విభాగం నాయకుడు నూతలపాటి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసులు కూడా ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.

ఈ కేసుల నేపథ్యంలో ఆర్జీవీ హైకోర్టు మెట్లెక్కారు. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్​ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వర్మ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే.. అరెస్ట్ విషయంలో భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. మంగళవారం విచారణ హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, హాజరు అయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా ఆదేశించాలని వర్మ తరపు లాయర్ కోర్టును కోరారు. విచారణకు హాజరుకావాలనే విషయంలో సమయం కోసం పోలీసులనే అడగాలని.. కోర్టు ముందు కాదని ఏపీ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆర్జీవీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.

Whats_app_banner