East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. ఒకపక్క రేవ్ పార్టీలు.. మరోపక్క స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం!
East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు కలకలం సృష్టిస్తోన్నాయి. ఒకపక్క రేవ్ పార్టీలు, మరోవైపు స్పా సెంటర్ పేరుతో వ్యభిచార కేంద్రాలు నడుస్తోన్నాయి. వీటీపై పోలీసులు నిఘా పెట్టారు. రేవ్ పార్టీలో 19 మందిని, స్పా సెంటర్ వద్ద ఉన్న వ్యభిచార కేంద్రంలో 9 మందిని అరెస్టు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ ఘటన కలకలం రేపింది. నూతన సంవత్సరం సందర్భంగా కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. ఈ ఘటన రాజమండ్రికి కూతవేట దూరంలో ఉన్న బూరుడుపూడి గేట్ సమీపంలో జరిగింది.
మెరుపు దాడి..
రేవ్ పార్టీపై సమాచారం అందడంతో.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ఆ సమయంలో పురుషులు మద్యం సేవిస్తుండగా, మహిళలు నృత్యం చేస్తూ కనిపించారు. వెంటనే ఆ వేడుకను నిలిపివేసి, అందులో పాల్గొన్న 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కళ్యాణ మండపం నిర్వాకులు సత్తి బామిరెడ్డి, సత్తి రామిరెడ్డి, గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రంగేటి గోపాలకృష్ణ, కాకినాడకు చెందిన ముగ్గురు, రాజమండ్రికి చెందిన మరో ఇద్దరు మహిళలతో సహా నిందితులు ఉన్నారు. వీరి వద్ద మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా..
నిందితులను స్పెషల్ హోమ్‌కు తరలించారు. ఇందులో అందరూ డీలర్లే ఉన్నారని, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఎవ్వరూ లేరని సీఐ వై.సత్య కిషోర్ తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఏమీ దొరకలేదని వెల్లడించారు. వ్యాపారాన్ని పెంచుకోవడానికే యువతులను ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఆర్. గోపాలకృష్ణ.. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఫర్టిలైజర్స్ సేల్స్ ఎగ్జక్యూటివ్‌గా పని చేస్తున్నారు. ఆయన తన వ్యాపారాన్ని విస్తరింప చేసేందుకు.. డీలర్లను దగ్గర చేసుకుని న్యూ ఇయర్ సందర్భంగా ఈ పార్టీ పెట్టారు.
మద్యం తాగుతూ..
ఈ సందర్భంగా డీలర్లను తీసుకొచ్చి, ఒక యువతి, నలుగురు మహిళలను రప్పించి పార్టీ ఇచ్చారు. మద్యం తాగుతూ చిందులు తొక్కారు. పోలీసులు దాడి చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్.. అది రేవ్ పార్టీ కాదని అన్నారు. రేవ్ పార్టీ సంస్కృతి ఇంకా రాజమండి దరిచేరలేదని అన్నారు. ఆ ఘటన ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించినదని స్పష్టం చేశారు. మహిళలతో నృత్యాలు చేయిస్తున్నారని వచ్చిన సమాచారం దాడి చేసినట్లు తెలిపారు. అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
స్పా సెంటర్‌లో..
రాజమండ్రి జేఎన్ రోడ్‌లో హ్యాపీ స్ట్రీట్ దగ్గరిలో ఓ స్పా సెంటర్ ఉంది. దాంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆదివారం అర్థరాత్రి ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. స్పా నిర్వాహకులు, ఇద్దరు విటులను ఆరుగురు బాధిత యువతులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. గుంటూరుకు చెందిన అంకెం వీరస్వామి స్పా సెంటర్ నడుపుతున్నారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)