Vallabhaneni Vamsi Arrest : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలు కారణం ఇదే!
Vallabhaneni Vamsi Arrest : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గతంలో లోకేష్, చంద్రబాబుపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పటమట పోలీసులు వంశీని.. గురువారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
సత్యవర్థన్ ఫిర్యాదుతో..
గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి.. బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తనను బెదిరించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో.. తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్థన్ ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
బెయిల్ కోసం..
వల్లభనేని వంశీపై బీఎన్ఎస్ సెక్షన్లు 140 (1), 308, 351 (3), రెడ్ విత్ 3 (5) కింద కేసులు నమోదు చేశారు. అటు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం వాదనలు జరిగాయి. నిందితులు ముందస్తు బెయిళ్లు, రెగ్యులర్ బెయిళ్లు మంజూరు చేయాలని దాఖలు చేసుకున్నారు. అయితే.. ఈ ఘటనలో నిందితులు స్వయంగా పాల్గొన్నారని, బెయిళ్లు మంజూరు చేయొద్దని పోలీసులు వాదించారు.
సెక్షన్లు ఎందుకు మార్చారు..
2023లో ఘటన జరిగితే.. ఏడాదిన్నర తర్వాత సెక్షన్లు ఎందుకు మార్చారని న్యాయాధికారి హిమబిందు ప్రశ్నించారు. ఆ సమయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదని ఏపీపీ చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును గురువారానికి వాయిదా వేశారు. ఈ సమయంలో వంశీని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.
2023 ఫిబ్రవరిలో..
2023 ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసు ఆవరణలోని ఓ కారుకు నిప్పంటించారు. క్షణాల్లో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కారు కాలి బూడిదైపోయింది. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది.