Wakf Bill Issue: వక్ఫ్ బిల్లుపై ఏపీ పార్టీల చెరోదారి.. మద్దతిచ్చిన టీడీపీ.. వ్యతిరేకించిన వైసీపీ
Wakf Bill Issue: వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ లోని ఏ పార్టీ ఎటువైపు ఉన్నాయి. రాష్ట్రంలోని అధికార టీడీపీ మద్దతు ఇవ్వగా, ప్రతిపక్ష వైసీపీ వ్యతిరేకించింది. ఈ సందర్భంగా బిల్లుపై ఆయా పార్టీల వైఖరి స్పష్టం అయింది.
Wakf Bill Issue: వక్ఫ్ సవరణ బిల్లును గురువారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార టీడీపీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని సమర్థించింది. ప్రతిపక్ష వైసీపీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించింది. దీంతో వక్ఫ్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ పార్టీల వైఖరి స్పష్టం అయింది. అలాగే తెలంగాణకు చెందిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించారు.
లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ (అమలాపురం) జీఎం హరీష్ బిల్లు ప్రవేశపెట్టడానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ జీఎం హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడాన్ని తాము అభినందిస్తున్నామని, మత సంస్థలకు ఆస్తులు డొనేట్ చేసేవారి ప్రయోజనాలను కాపాడాలని అన్నారు.
ఆ ప్రయోజనాలు దుర్వినియోగం అయితే, ఆ వ్యవస్థలో పారదర్శకత కోసం సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నామని అన్నారు. అయితే విస్తృత సంప్రదింపుల కోసం బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీ (రాజంపేట) పీవీ మిథున్ రెడ్డి బిల్లును వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చిన ముందే ముస్లీం వర్గంతో సంప్రదింపులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తాను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన అన్ని అంశాలతో ఏకీభవిస్తున్నామని అన్నారు.
ఇదిలా ఉండగా ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు జేడీయూ ఎంపీ లలన్ సింగ్, శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ ఏక్‌నాథ్ మద్దతు తెలిపారు. ప్రతిపక్షాల ఇండియా కూటమి ఎంపీలు వ్యతిరేకించారు.
ఈ బిల్లును ఎస్‌పీ ఎంపీ మోహిబ్బుల్లా, టీఎంసీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కళ్యాణ్ బెనర్జీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్‌పీ ఎంపీ అఖిలేష్ యాదవ్, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే, సీపీఎం ఎంపీ కె. రాధాకృష్ణన్, ఐయూఎంఎల్ ఎంపీ ఈటీ మహ్మద్ బహీర్, ఆర్ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, వీసీకే ఎంపీ తిరుమవలవన్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగొయ్, ఇమ్రాన్ మసూద్, నేషనల్ కాన్ఫెరెన్స్ ఎంపీ అల్టాఫ్ అహ్మద్, సీపీఐ ఎంపీ సుబ్బరాయన్ తదితరులు వ్యతిరేకించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)