ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మే 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త కార్డుల నమోదు, కార్డుల్లో మార్పుచేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిని అంచెలంచెలుగా పరిశీలించి 21 రోజుల్లో కార్డులు జారీ చేయనున్నారు. నేటి(మే 15) రేషన్ కార్డుల దరఖాస్తులను వాట్సాప్ మన మిత్రలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించారు.
రేషన్ కార్డుల దరఖాస్తులపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం మూడు సవరణలు చేసినట్లు తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ లో ప్రకటించారు.
1. బియ్యం కార్డును విభజించడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదు
2. బియ్యం కార్డును స్వచ్ఛందగా సరెండర్ చేయవచ్చు.
3. వలస వెళ్లిపోతే బియ్యం కార్డును తొలగిస్తారు.
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా స్పిల్టింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. కొత్తగా పెళ్లైన జంటలు లేదా ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం పెట్టినవారు తమ కార్డులను విభజించుకోవాలనుకుంటారు. వీరి కోసం ప్రభుత్వం రేషన్ కార్డు స్పిల్టింగ్ కు అవకాశం కల్పించింది. ఈ సేవలు పొందేందుకు వివాహ ధృవీకరణ పత్రం అడిగేవారు.
తాజాగా మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీంతో పాటు స్వచ్ఛందంగా రేషన్ కార్డు వదులుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిన వారి కోసం డిలీషన్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. వివాహం కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా జీవిస్తున్న వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆశ్రమాల్లో ఉంటున్న వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.
ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు, అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న వారికి అంత్యోదయ అన్నయోజన కార్డులు అందించనున్నారు. ఈ కార్డు కింద ప్రతినెలా 35 కేజీల బియ్యం ఇస్తారు. ఏలూరు, అల్లూరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉండే 12 కులాల గిరిజనులు, చెంచులకు అంత్యోదయ అన్నయోజన కార్డులు అందించనున్నారు.
సంబంధిత కథనం