AP Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కసరత్తు, దసరాలోగా మార్గదర్శకాలు విడుదలయ్యే ఛాన్స్?
AP Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డులతో పాటు కొత్త జంటలకు రేషన్ కార్డులు జారీపై రంగం సిద్ధం చేస్తోంది. దసరాలోపు ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో కూడా బియ్యం మాత్రమే అందించనున్నట్లు సమాచారం.
AP Ration Cards : ఏపీ ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. దీంతో పాటు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అలాగే చంద్రన్న కానుకలు, నిత్యావసరాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయి. ప్రతి నెలా బియ్యంతో పాటు సబ్సిడీపై పంచదార, కందిపప్పు, నిత్యావసరాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పౌరసరఫరాల శాఖను ఆదేశించారు.
కొత్త రేషన్ కార్డుల జారీ
ఏపీ ప్రజలు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది కానీ ఎన్నికల హడావుడిలో కార్డులు జారీ చేయలేదు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే మరింత ఆర్థిక భారమని భావించిన వైసీపీ ప్రభుత్వం ఏడాది క్రితమే కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో...మళ్లీ కొత్త రేషన్ కార్డుల డిమాండ్ తెరపైకి వచ్చింది. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పింది. అయితే ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. కొత్తగా పెళ్లైన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనిపై ఇంకా అధికారంగా జీవో జారీ కాలేదు.
వైసీపీ ప్రభుత్వం ఏటా జులై, డిసెంబర్ నెలల్లో పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులకు పరిశీలించి రేషన్ కార్డులను జారీ చేసేది. కొత్త ప్రభుత్వం ఏ తరహాలో రేషన్ కార్డులు జారీ చేస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇంకా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో దాదాపు 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులపై దసరా లోగా మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత టీడీపీ హయాంలో రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, అప్పుడప్పుడు ఇతర నిత్యావసరాలు ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. సరుకుల సంఖ్యను పరిమితం చేసింది. ఇక కరోనా తర్వాత బియ్యం, పంచదార మాత్రం రేషన్ షాపుల్లో ఇస్తున్నారు. కూటమి సర్కారు వచ్చాక నిత్యావసరాలు అందిస్తామని ప్రకటన చేసింది. అయితే ఆగస్టు నెలలో రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం మాత్రమే అందించారు. పంచదార, కందిపప్పు అందించలేదు. సెప్టెంబర్ నెలలో కూడా రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ కష్టమనేనని తెలుస్తోంది. వచ్చే నెల రేషన్ సరుకుల్లో కూడా కందిపప్పు, పంచదార పంపిణీ చేయడం సాధ్యపడేలా లేదంటున్నారు. సెప్టెంబరు కోటాలో కూడా కేవలం ఉచిత బియ్యం మాత్రమే అందించనున్నారు.
టెండర్ల ప్రక్రియ ఆలస్యం
ఏపీ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో రాయితీపై కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 పైగా, పంచదార కిలో రూ.50 వరకు ధర పలుకుతోంది. దీంతో రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు రాయితీపై రూ.67, పంచదార రూ.17 కు అందించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఆగస్టు నుంచి అక్టోబరు వరకు సరిపడేలా కందిపప్పు, చక్కెరను పౌరసరఫరాల శాఖ ద్వారా ఈ-ప్రొక్యూర్మెంట్ చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 22 వేల మెట్రిక్ టన్నులకు పైగా కందిపప్పు, 17 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంచదార సేకరించాలని అధికారులు భావించారు. కందిపప్పు టెండర్ల విషయం జ్యుడీషియల్ ప్రవ్యూకు వెళ్లడం, పంచదార టెండర్లకు కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేశారని అధికారులు ఆ టెండర్లను రద్దు చేశారు. దీంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ కారణాలతో సెప్టెంబర్ నెలలో కూడా సబ్సిడీ పంచదార, కందిపప్పు పంపిణీ కాకపోవచ్చని తెలుస్తోంది.
సంబంధిత కథనం