AP New Ration Card Details : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్, జనవరి నుంచి ప్రక్రియ షురూ!-ap new ration card apply start from january 2025 civil supply department plans on new design cards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Ration Card Details : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్, జనవరి నుంచి ప్రక్రియ షురూ!

AP New Ration Card Details : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్, జనవరి నుంచి ప్రక్రియ షురూ!

Bandaru Satyaprasad HT Telugu
Nov 03, 2024 02:17 PM IST

AP New Ration Card Details : కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తుంది. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులు జారీ చేయనున్నారు. వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్, జనవరి నుంచి ప్రక్రియ షురూ!
కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్, జనవరి నుంచి ప్రక్రియ షురూ!

కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రస్తుత కార్డుల రీడిజైన్‌ తో పాటు కొత్త లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

ఏపీలో ప్రభుత్వం 1 కోటి 48 లక్షల వైట్ రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిల్లో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార ఇతర సరుకులు అందిస్తుంది. మిగిలిన కార్డులకు అందిస్తున్న ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులకు అయ్యే రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ కార్డులను కూడా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతుంది. అయితే కేంద్రం నుంచి స్పందనలేదు.

ఆ కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... రాష్ట్రానికి ఆర్థికభారం కాకుండా కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల వినియోగంపై సమీక్షలు చేస్తుంది. పౌరసరఫరాల శాఖ డేటా ఆధారంగా రాష్ట్రంలోని 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు, మరో 1,36,420 పీహెచ్‌హెచ్‌ కార్డుదారులు... గత ఆరు నెలలుగా రేషన్‌ సరుకులు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు. ఈ కార్డులు తొలగిస్తే ఏడాదికి రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వీటి స్థానంలో అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

జనవరిలో కొత్త రేషన్ కార్డులు

ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా 1.5 లక్షలకు పైగా పేద కుటుంబాలకు వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు వేస్తుంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో... రేషన్‌ కార్డుల రూపురేఖలు మార్చారు. బియ్యం కార్డులు సైతం జారీ చేశారు. రేషన్ కార్డులపై వైఎస్ జగన్, రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉండేవి. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో...రేషన్ కార్డుల డిజైన్లు మారనున్నాయి. లేత పసుపు రంగు కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉన్న రేషన్ కార్డు నమూనాను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది.

ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు సహా మార్పు చేర్పులు కోసం భారీగా కార్డులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 30,611 దరఖాస్తులు, కార్డుల స్ల్పిట్ కోసం 46,918 దరఖాస్తులు, సభ్యులను యాడ్ చేసేందుకు 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588, అడ్రస్‌ మార్పు కోసం 8,263, సరెండర్‌ కోసం 685 దరఖాస్తులు... మొత్తంగా 3.36 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం