ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే దరఖాస్తుల్లో కొత్త చిక్కులు వస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం బియ్యం కార్డుల్లో పేర్ల తొలగిపు లేదా జోడింపు వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
రైస్ కార్డుల్లో పేర్ల తొలగింపు లేదా జోడింపునకు పత్రాల చిక్కొచ్చిపడింది. స్వయంగా మంత్రి, ఉన్నతాధికారులు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరంలేదని చెబుతున్నా.. దరఖాస్తు సమయంలో మాత్రం అవి కావాల్సిందేనని సిబ్బంది అంటున్నారు. మరణించిన వారి పేర్లు మినహా ఇతరుల పేర్లు రైస్ కార్డుల నుంచి తొలగించే అవకాశం లేదని సిబ్బంది అంటున్నారు.
ఈ నెల 7న ప్రారంభమైన ప్రక్రియలో ఇప్పటి వరకూ 3,48,399 దరఖాస్తులు అందాయి. వీటిలో 75 శాతం అప్లికేషన్లు కుటుంబ సభ్యులను కార్డుల్లో చేర్చుకునే ప్రక్రియలో వచ్చినవే. దీనికీ ఈకేవైసీ, సర్వర్ సమస్యలు వెంటాడుతున్నాయి.
గ్రామాల్లో చాలా మందికి పెళ్లి ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కొత్తగా పెళ్లైన వారు రైస్ కార్డులో కుటుంబసభ్యుడి పేరు చేర్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో వీరంతా ఇప్పుడు కొత్తగా పెళ్లికార్డులు ప్రింట్ చేయించుకుంటున్నారు.
సాధారణంగా పెళ్లైన 60 రోజుల్లోగా గ్రామ, వార్డు సచివాలయంలో పెళ్లి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ గడువు దాటిపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాలి. ఇప్పుడు పెళ్లి సర్టిఫికేట్ లింక్ పెట్టడంతో...సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పరుగులు పెడుతున్నారు. సర్టిఫికేట్ వచ్చేలాగా దరఖాస్తు గడువు ముగుస్తుందనే ఆందోళన దరఖాస్తుదారుల్లో మొదలైంది.
వివాహ ధ్రువపత్రాలు అవసరం లేదని, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నంబరు, ఫొటో ఇస్తే దరఖాస్తు అప్లోడ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే మ్యారేజీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే ప్రాసెస్ ముందుకు వెళ్తుందని సచివాలయ సిబ్బంది అంటున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయకపోవడంతో ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.
హౌస్ హోల్డ్ డేటా ఎనేబుల్ చేయకపోవడంతో సమస్యలు వస్తు్న్నాయని సచివాలయ సిబ్బంది అంటున్నారు. ఒకే తెల్ల రేషన్ కార్డుపై...రెండు రైస్ కార్డులు ఉంటున్నాయి. కుటుంబ సభ్యులుంతా ఒకే మ్యాపింగ్ కింద ఉంటున్నారు. కుటుంబ విభజన అవకాశం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
హౌస్ హోల్డ్ డేటా విభజనకు కూడా ఎనేబుల్ చేయాలని కోరుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు.
బియ్యం కార్డుల దరఖాస్తుదారులను సర్వర్ ముప్పుతిప్పలు పెడుతోంది. ఉదయం వచ్చిన వారిని సాయంత్రం వరకూ సచివాలయాల్లో కూర్చోబెడుతోంది. సర్వర్లు సరిగ్గా పనిచేయడంలేదని, పనిచేసిన కాసేపు ఏదో సమస్యలు వస్తున్నాయంటున్నారు.
మొబైల్ ద్వారా ఈకేవైసీ చేయాలన్నా, సర్వర్ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. మరో 10 రోజుల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు ముగుస్తాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
సంబంధిత కథనం