CBN In Tirumala: తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభం.. రాగ ద్వేషాల్లేని పాలన అందిస్తానన్న చంద్రబాబు-ap new cm chandrababu says cleansing begins from tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Tirumala: తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభం.. రాగ ద్వేషాల్లేని పాలన అందిస్తానన్న చంద్రబాబు

CBN In Tirumala: తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభం.. రాగ ద్వేషాల్లేని పాలన అందిస్తానన్న చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Jun 13, 2024 11:45 AM IST

CBN In Tirumala: రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచి ప్రారంభిస్తానని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ‌్వరుడి దర్శనం చేసుకున్న చంద్రబాబు ఐదేళ్లలో తిరుమలను సర్వనాశనం చేశారని ఆరోపించారు.

తిరుమలలో దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వస్తున్న చంద్రబాబు
తిరుమలలో దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వస్తున్న చంద్రబాబు

CBN In Tirumala: ఏపీలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమలను ఐదేళ్లలో అపవిత్రం చేశారని, తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్పవేరే నినాదం ఉండకూడదన్నారు.

గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని, బ్లాక్‍ లో టికెట్లు అమ్ముకున్నారని, తిరుమల కొండపైకి గంజాయి. నాన్‌వెజ్‌, మద్యంతో పాటు అన్యమత ప్రచారాలను కూడా అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామిని ఊరూరా తిప్పారని, పెళ్లిళ్లు పేరంటానికి కూడా శ్రీవారిని తీసుకెళ్లారని, వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈజన్మలోనే శిక్ష తప్పదని నిరూపితమైందన్నారు.

వెంకటేశ్వర స్వామి కులదైవమని, 2003లో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినపుడు క్లెమోర్ మైన్స్ పేలాయని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తాను చనిపోతే ఆయనకు అపవాదు వచ్చేది. నా వల్ల రాష్ట్రానికి అవసరం ఉందని గుర్తించి స్వామివారు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇకపై ఏమి చేయాలో ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. తెలుగుజాతి అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాననిచెప్పారు. టీటీడీతోనే రాష్ట్ర ప్రక్షాళన ప్రారంభం కావాల్సి ఉందన్నారు.

మారని పోలీసుల తీరుపై బాబు ఆగ్రహం…

తాను వస్తే పరదాలు కడుతున్నారని, వారికి హ్యాంగోవర్‌ తగ్గలేదని. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం రాలేదని, కర్ఫ్యూ పెట్టేసి ప్రజల్ని రాకుండా చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తక్షణం మార్చాలని క్రౌడ్ మేనేజ్‌మెంట్ తెలియాలన్నారు.

తన కుటుంబానికి తాను ఏమి చేయాల్సిన అవసరం లేదన్నారు. 35ఏళ్ల క్రితమే తమ కుటుంబానికి చిన్న వ్యాపారం ఇచ్చానని, తన భార్య, కుమారుడు వ్యాపారాలను చూసుకున్నారని, వాళ్లకు తాను కేవలం సమయం ఇవ్వాల్సి ఉందన్నారు. ఇకనైనా కుటుంబానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. .

ప్రజలు గెలిచి రాష్ట్రాన్ని నిలబెట్టారని, వాళ్లను తాను గౌరవించాల్సి ఉందన్నారు. తాను అందరి వాడినని ,ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన మనిషి అన్నారు. కొందరు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని, శనివారం వస్తే భయపడే రోజులు గడిచాయన్నారు. పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారని, శనివారం వస్తే ప్రోక్లెయిన్ వస్తుందని భయపడ్డారన్నారు. ఇప్పుడు అలాంటి భయాలు అవసరం లేదన్నారు.

రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని, సోషల్ యాక్టివిస్ట్‌లు కూడా ఇబ్బంది పడ్డారని, ప్రజలు తమకు జరిగిన అన్యాయం చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కున్నారని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి మంచి చేసే అవకాశం ఇవ్వాలని, జరిగిన నష్టాన్ని పూడ్చే శక్తి ఇవ్వాలని కోరుకున్నానని, 30ఏళ్లకు సరిపడా నష్టం జరిగిందని, తనకు ఎలాంటి రాగద్వేషాలు లేవని, ప్రజలు ఓట్లేసి తమ బాధ్యత పూర్తైందనుకోకుండా నిత్య చైతన్యంతో పనిచేయాలన్నారు.

పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని, ఇష్టానుసారం వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమలలో వేంకటే‌శ్వర నామం తప్ప మరో పేరు వినడానికి వీల్లేదన్నారు. గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందని టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని చెప్పారు.

గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని - రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తానని, ఏపీని అభివృద్ధిలో నెం.1 చేస్తానన్నారు. అమరావతి విధ్వంసమైంది.. పోలవరాన్ని నీళ్లలో ముంచేశారని అమరావతి, పోలవరాన్ని చక్కదిద్ది.. పూర్తి చేస్తానన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తానన్నారు.

WhatsApp channel