రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్షసాధింపులు, పోలీసులను పావులుగా వాడుతున్నారు - సజ్జల రామకృష్ణారెడ్డి-ap nda govt accused of using police on opposition parties under red book constitution ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్షసాధింపులు, పోలీసులను పావులుగా వాడుతున్నారు - సజ్జల రామకృష్ణారెడ్డి

రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్షసాధింపులు, పోలీసులను పావులుగా వాడుతున్నారు - సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు దిగజారాయని, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని వాైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావులగా వాడుతున్నారని ఆరోపించారు.

రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్షసాధింపులు, పోలీసులను పావులుగా వాడుతున్నారు - సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థను నీరుగారుస్తూ, రాజకీయ కక్షసాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు.

మాజీ మంత్రి రజినిపై దౌర్జన్యం

ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు...పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం

చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనాన్ని ప్రజలు ముందు పెట్టేందుకు వైసీపీ ఒక కార్యాచరణను సిద్దం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

తప్పుడు కేసులు బనాయిస్తున్నారు

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ....కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమన్నారు.

రెడ్ బుక్ రాజ్యాంగం

రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నిసార్లు డీజీపీ అపాయింట్‌మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైసీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా స్పందిస్తుందని అన్నారు.

కుట్టు మిషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం దోపిడీ

టీడీపీ ప్రభుత్వం కుట్టుమిషన్ల స్కాంపై అమలాపురంలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గడియార స్తంభం సెంటర్లో కుట్టుమిషన్ల వ్యవహారంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా వైసీపీ నేతలు పాల్గొన్నారు.

"బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి కుట్టు శిక్షణ ఇస్తామని చెప్పి పెద్ద పథకాన్ని ప్లాన్ చేసిన కూటమి ప్రభుత్వం అందులో పావలా వంతు మహిళలకు ఇచ్చి ముప్పావలా వంతు నాయకులు తినేసేలా ప్లాన్ చేశారు.

బీసీ మహిళల పేరిట ప్రకటనలు చేసి పెద్దలు జేబులు నింపుకునే అవినీతి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం విజయవంతంగా పథకం వేసింది"-పినిపే శ్రీకాంత్, అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం