మీరు నడిపిన భూమాఫియాలానే ధర్మవరంలోనూ మీ మిత్రుడు చేశాడు - కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ ఫైర్-ap minister satya kumar yadav counter to ktr comments over dharmavram ex mla kethrireddy defeat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మీరు నడిపిన భూమాఫియాలానే ధర్మవరంలోనూ మీ మిత్రుడు చేశాడు - కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ ఫైర్

మీరు నడిపిన భూమాఫియాలానే ధర్మవరంలోనూ మీ మిత్రుడు చేశాడు - కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ ఫైర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 10, 2024 02:45 PM IST

Minister Satya Kumar Yadav On KTR : ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. అవినీతి, అహంకారమే మీ ప్రియ మితులను ఓడించాయ్ అంటూ కౌంటర్ వేశారు.

కేటీఆర్ పై ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్
కేటీఆర్ పై ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్

Minister Satya Kumar Yadav On KTR : ఏపీ ఎన్నికల ఫలితాలతో పాటు ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై కేటీఆర్ చిలుక పలుకులు పలుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

yearly horoscope entry point

“ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియాలాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు” అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

“మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి” అంటూ మంత్రి సత్య కుమార్ సెటైర్లు విసిరారు.

అసలు కేటీఆర్ ఏమన్నారంటే…?

మంగళవారం ఏపీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏపీలో జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్ లో కేటీఆర్ మాట్లాడుతూ... వైసీపీ పాలనపై ప్రశంసలు కురిపించారు.

ఏపీలో జగన్ హీరో, షర్మిల జీరో అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రజలకు మంచి పనిచేసినా ఓడిపోయారన్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, అయినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలకు మంచి చేసిన ఎంతో మంది ఎన్నికల్లో ఓడిపోవడం విచిత్రంగా అనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా, ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, అది సాధారణ విషయం కాదన్నారు. 40 శాతం మంది ఓటర్లు జగన్‌ వెంటే ఉన్నారు.

వైఎస్ షర్మిలకు అసలు నాయకత్వ లక్షణాలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో జగన్‌ను ఓడించేందుకు షర్మిలను ఒక పావులా వాడుకున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమితో జతకట్టడంతోనే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎప్పుడూ ప్రజల్లో తిరిగే కేతిరెడ్డి ధర్మవరంలో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు తనను షాక్‌కు గురిచేశాయన్నారు.

ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి సత్య కుమార్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ…'X'లో పోస్ట్ చేశారు.

Whats_app_banner