Telugu News  /  Andhra Pradesh  /  Ap Minister Dharmana Prasada Rao Slams Tdp And Volunteers Should Campaign For Government For Ysrcp Welfare Schemes
మంత్రి ధర్మాన ప్రసాదరావు
మంత్రి ధర్మాన ప్రసాదరావు

Dharmana Comments : చంద్రబాబు గెలిస్తే వాలంటీర్లపైనే తుపాకీ…. ధర్మాన ప్రసాదరావు

07 February 2023, 11:40 ISTHT Telugu Desk
07 February 2023, 11:40 IST

Dharmana Comments రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. వాలంటీర్లు ఏ పార్టీకి ఓటెయ్యాలో ఎందుకు చెప్పకూడదని ప్రశ్నించిన ధర్మాన, ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Dharmana Comments ఏపీలో వైసీపీని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటెయ్యాలో చెప్పకూడదని, ఎవరు చెప్పారని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

శ్రీకాకుళం జిల్లా సత్తివాడలో గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన విపక్షాలపై మండిపడ్డారు. దేశమంతా ధరలు పెరుగుతుంటే ఏం చేయగలం అని ప్రశ్నించారు. వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటు వెయ్యాలో ఏ పార్టీ మంచిదో చెప్పకూడదని, ఎవరు చెప్పారని మంత్రి ప్రశ్నించారు.

ప్రతి వాలంటీర్ తన పరిధిలో ఉన్న 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలియపరుస్తూ నచ్చ చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయి అంటున్నాయని ధర్మాన దేశమంతా ధరలు పెరిగాయని ఇటువంటి కారణాలు చెప్పి ప్రభుత్వం మీద చెడు అనిపించడానికి వీల్లేదన్నారు.

గ్రామానికి చెందిన అప్పల నరసమ్మ తాను ఎన్టీ రామారావు భక్తురాలని అంటుందని, సినిమా వేరు నిజ జీవితంలో జరిగేది వేరన్నారు. అన్ని కులాల వారు కలిసి జీవిస్తున్న ఇటువంటి గ్రామంలో కూడా చైతన్యం రాకపోతే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. వ్యవసాయానికి నీరు ఇవ్వడానికి ప్రయత్నించింది జగన్, ధర్మాన అని తెలుసుకోవాలంటూ వెల్లడించారు.

ప్రభుత్వం ఇచ్చే పథకాలు తీసుకుంటూనే, కుటుంబం హాయిగా గడవడానికి కారణం అయిన ప్రభుత్వాన్ని విమర్శిస్తారన్నారు. చంద్రబాబు తుపాకీ పేల్చేలోపు మనమే చంద్రబాబుపై తుపాకీ పేల్చాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మంత్రి ధర్మాన పాల్గొని ప్రసంగించారు. వాలంటీర్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారని మంత్రి ధర్మాన అన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాల గురించి వివరించే హక్కు వాళ్లకు ఉందని తెలిపారు. ఈ పథకం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని వాళ్లకు వివరించి.. ప్రజలను సరైన మార్గంలో నడిపించాలని ధర్మాన సూచించారు. ఏ పార్టీకి ఓటు వేయాలి? ఏ పార్టీ మంచిదో వాలంటీర్లు చెప్పకూడదని ఎవరన్నారని ప్రశ్నించారు.

ఏ పార్టీకి ఓటు వేయాలో చెప్పే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పిన ధర్మాన.. వాలంటీర్‌ కూడా ఒక పౌరుడేనని గుర్తు చేశారు. మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే అధికారం.. మంచి ప్రభుత్వం గురించి ప్రచారం చేసే అవకాశం, మంచి కార్యక్రమం గురించి చెప్పే హక్కు వాలంటీర్లకు ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వస్తే మొట్టమొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని హెచ్చరించారు. ఆయన పేల్చేదాకా ఎందుకు ఆగడం.. మనమే పేలిస్తే అయిపోతుంది కదా అని.. మన దగ్గర కూడా తుపాకీ ఉందని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

ఏపీలో నిత్యవసర వస్తువులు పెరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా ఏపీ మంత్రి ధర్మాన నిప్పులు చెరిగారు. ధరలు పెరిగాయని గగ్గోలు పెడుతున్నారని, దేశమంతటా ధరలు పెరిగాయని గుర్తు చేశారు. దేశం మొత్తం జగన్‌మోహన్‌రెడ్డి పాలనే లేదు కదా అని ఎద్దేవా చేశారు. ధరలు పెరిగిన మాట నిజమే అని.. ఒక్క ఏపీలోనే కాదు ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ అంతటా ఇవే ధరలు ఉన్నాయని చెప్పారు.

టాపిక్