Minister Achhennaidu: జనం తిరస్కరించడంతో జగన్‌ మానసిక ఆరోగ్యం పాడైందన్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు-ap minister atchannaidu says jagans mental health has deteriorated due to peoples rejection ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Achhennaidu: జనం తిరస్కరించడంతో జగన్‌ మానసిక ఆరోగ్యం పాడైందన్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

Minister Achhennaidu: జనం తిరస్కరించడంతో జగన్‌ మానసిక ఆరోగ్యం పాడైందన్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

Sarath Chandra.B HT Telugu
Published Feb 19, 2025 05:07 PM IST

Minister Achhennaidu: ఏపీ ప్రజలు తిరస్కరించడంతో జగన్ మానసిక ఆరోగ్యం పాడైనట్టుందని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలస్ కు పరిమితం అయిన జగన్ ఇప్పుడు రోడ్డుపై కి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర‌శించారు.

ఏపీ వ్యవసాయ  మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

Minister Achhennaidu: జగన్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలు తిరస్కరించారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదనే ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారని,  గెలుపు ఓటములు ఎవరికైనా సహజమైనా,  ఆయన మానసిక ఆరోగ్యం దెబ్బతిందని భావిస్తున్నట్టు చెప్పారు. 

రాష్ట్రానికి ఆదాయం తెచ్చే శాఖలను ఐదేళ్ల పాటు తాళం వేసిన వ్యక్తి ఇప్పుడు వారి గురించి మాటలాడటం విచిత్రంగా ఉందన్నారు.  వ్యవసాయ శాఖ లో ఒక్క సెంటు భూమి లో కూడా సాయిల్ టెస్టింగ్ చేయలేదని,  వ్యవసాయాన్ని అటకమీద పెట్టిన జగన్ రైతులను దారుణంగా నష్టపరిచారని,  వ్యవసాయ యాంత్రీకరణ పై కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. 

రాయలసీమలో రైతులకు  డ్రిప్ స్ప్రింకలర్ లు కనీసం ఇవ్వలేదని,  రైతులకు రూ.1600 కొట్లు బకాయి పెట్టిన జగన్ కూడా వ్యవసాయం గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.  ఈ ఎనిమిది నెలల్లో టమాటా ధర తగ్గితే మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి ద్వారా కొనుగోలు చేశామని,  గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన జగన్ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. 

మిర్చి యార్డు చరిత్ర కూడా తెలియకుండా జగన్ మాట్లాడారని,  ఏపితో పాటు వివిధ రాష్ట్రాల్లో మిర్చి పండుతోందని,  ఏపీలోని 11 జిల్లాల్లో సాగు చేస్తున్నారని,  2015 నుంచి పోలిస్తే 2023-24లో మాత్రమే రూ20,500 క్వింటాలు కు ఉందన్నారు.  రైతులు, కూలీల ఇబ్బందులు ప్రభుత్వం ఎప్పుడో గుర్తించిందని,  2020 లో జగన్ ప్రభుత్వమే మిర్చి కి రూ.7 వేలు మద్దతు ధర ప్రకటించారని,  కానీ అప్పటికి గుంటూరు మిర్చి యార్డు లో మిర్చి ధర రూ.12,500 గా ఉందన్నారు. 

ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన తరవాత బయట మార్కెట్ లో అంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయరని,  జగన్ కు పనేమీ లేదు కాబట్టే మిర్చి యార్డు కు వెళ్లి అనవసర రాద్ధాంతం చేశారన్నారు.  సీఎం నాలుగు సార్లు లేఖలు రాశారని, , కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఎప్పటికపుడు దీనిపై పరిస్థితిని ఢిల్లీ లో వివరిస్తున్నారని చెప్పారు.  మిర్చి యార్డు లో ప్రస్తుతం కొనుగోళ్లు మళ్ళీ పెరిగాయని, మిర్చి ధర పడిపోతే 2017 లో అప్పటి టిడిపి ప్రభుత్వం రూ.138 కొట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. 

గత ఏడాది కోల్డు స్టోరేజీలో పెట్టిన మిర్చి బస్తాలు ఖాళీ అయ్యాయని,  విదేశాల్లో మిర్చికి డిమాండ్ పెరుగుతోందని, రైతులకు నష్టం వాటిల్ల కుండా చూస్తున్నామన్నారు.  మూర్ఖుడైన జగన్ రెండు లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని చెప్పారని,  రైతులు పత్తి, కంది లాంటి ప్రత్యామ్నాయం పంటలు వేసుకున్నారని, సీఎం గా పని చేసిన జగన్ కి మాత్రం అవగహన లేదా అన్నారు.  ప్రస్తుతం మిర్చి ధర మరో 500 రూపాయల మేర పెరిగిందని,  ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జగన్ మిర్చి యార్డు కు వెళ్ళడం పై సదరు సంస్థ చూసుకుంటుందన్నారు. 

ధర ప్రకటిస్తే రైతులకు నష్టం..

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు. కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగాలేకపోవడం వల్ల మళ్లీ ఆదేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలిపారు. 

ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం ఇప్పటి వరకూ మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు. లాభదాయకత ను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలు వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు.

రాష్ట్రంలోని మిర్చి రైతులకు సాధ్యమైనంత మేర సహకరించాలని, ప్రస్తుతం ఉన్న కేంద్రం మద్దతు ధరను కూడా పెద్ద ఎత్తున పెంచాలని కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు డిల్లీ వెళుతున్నారన్నారు. ఈ విషయంలో కేంద్రానికి ఇప్పటి వరకూ నాలుగు లేఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్రాయడం జరిగిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల బృందంతో చర్చించనున్నారని, చర్చల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

మిర్చి ధరలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ  సీఎం చంద్రబాబు కేంద్రానికి  విజ్ఞప్తి చేశారు.  ధరల స్థిరీకరణ నిధి కింద తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలన్నారు.  ప్రైస్ డెఫిసియన్సీ పేమెంట్ పీడీపీ కింద చెల్లింపులు చేయాలని కోరారు.  మిర్చి రైతులు నష్టపోతున్న వందశాతం ధరను చెల్లించాలన్న సీఎం చంద్రబాబు,  మిర్చి ధరల విషయంలో ఏపీ రైతులను ప్రత్యేక కేసుగా గుర్తించాలన్నారు.  గుంటూరు మిర్చియార్డులో స్పెషల్ వెరైటీ క్వింటాలు ధర రూ.13,600గానూ కామన్ వెరైటీ ధర రూ.11,500 గా ఉందన్న సీఎం,  2023-24 లో క్వింటాలు ధర రూ.20 వేల వరకూ పలికిందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం 11,67,110 మెట్రిక్ టన్నుల మేర మిర్చి ఉత్పత్తి అయ్యే అవకాశముందని వివరించారు. 

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner