Mega Parent Teacher Meeting : పిల్లలు స్కూలుకు రాకపోతే తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ - సీఎం చంద్రబాబు
Mega Parent Teacher Meeting : ఏపీ వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెట్ టీచర్ మీటింగులు నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగులు నిర్వహించారు. ఇందులో కోటి 20 లక్షల మంది పాల్గొన్నారు. ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ తో ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర సృష్టించిందని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్లలోని మున్సిపల్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలను విన్నారు. పేరెంట్స్ మీటింగ్ అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రుల సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
పరీక్ష ఫలితాలు తల్లిదండ్రులకు మెసేజ్
భారత దేశ గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ అని సీఎం చంద్రబాబు అన్నారు. నైతిక విలువలతో పిల్లలను పెంచాలన్నారు. ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలని తయారు చేసి, పిల్లలని ప్రయోజకులని చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. పిల్లలు స్కూలుకు రాకపోతే ఫోన్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌లు వస్తాయన్నారు. తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. మన ముందు ఉన్న టెక్నాలజీ, అవకాశాలతో ఏదైనా సాధించగలమన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. మన సంస్కృతిలో తల్లి, తండ్రి, గురువుకి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. అలాంటి తల్లి, తండ్రి, గురువుని అందరినీ కలిపి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు.
పిల్లల చదువును తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బానిసలు కాకుండా జాగ్రత్తగా వహించాలన్నారు. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం స్కూళ్ల నుంచే ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
మహిళలని గౌరవించటం స్కూల్ లెవల్ నుంచే
విద్యా శాఖని తాను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గతంలో పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ రంగులు ఉండేవన్నారు. తాము అధికారంలోకి రాగానే, అవన్నీ తీసేశామన్నారు. విద్యాశాఖలో జరిగే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దల పేర్లు పెట్టి, స్ఫూర్తి నింపామన్నారు. ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించుకుంటున్నామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం మార్చుతున్నామన్నారు. పిల్లలకు చదువుతో పాటు, నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. మహిళలని గౌరవించటం స్కూల్ లెవల్ నుంచే నేర్పిస్తామన్నారు. పిల్లలకు నైతిక విలువలు నేర్పించటానికి సలహాదారుడిగా చాగంటి కోటేశ్వరరావును ముఖ్యమంత్రి నియమించారన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో.. ఒక్కసారి దానికి బానిస అయితే, జీవితం నాశనం అయిపోతుందని మంత్రి లోకేశ్ అన్నారు.
సంబంధిత కథనం