AP DSC 2024 : ఏ క్షణమైనా ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్..! జిల్లాల వారీగా టీచర్ల ఖాళీలివే….-ap mega dsc notification 2024 is likely to be released today or tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc 2024 : ఏ క్షణమైనా ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్..! జిల్లాల వారీగా టీచర్ల ఖాళీలివే….

AP DSC 2024 : ఏ క్షణమైనా ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్..! జిల్లాల వారీగా టీచర్ల ఖాళీలివే….

HT Telugu Desk HT Telugu

AP DSC 2024 Notification:మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఏ క్షణమైనా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024

AP DSC 2024 Notification:  రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చినప్ప‌టి నుండి మెగా డీఎస్సీపైనే చ‌ర్చ జ‌రుగుతుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ముఖ్య‌మంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత‌ మొద‌టి ఐదు సంత‌కాల్లో 16,347 పోస్టుల‌తో మెగా డీఎస్సీ పైన ఒక సంత‌కం చేశారు. ఈ మెగా డీఎస్సీకు మొద‌టి మంత్రి వ‌ర్గం స‌మావేశంలోనే ఆమోదం కూడా తెలిపారు.

మే 13న రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి. జూన్ 4న ఫ‌లితాలు వెల్ల‌డైయ్యాయి. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అఖండ విజ‌యం సాధించింది. జూన్ 12న చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా, మంత్రులుగా మూడు పార్టీల‌కు చెందిన నేత‌లు ప్ర‌మాణ స్వీకారం చేశారు.

 జూన్ 13న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్రబాబు, ఐదు కీల‌క ఫైల్‌పై సంత‌కం చేశారు. అందులో ఒక‌టి 16,347 పోస్టుల‌తో మెగా డీఎస్సీ ఫైల్ ఉంది. అలాగే మొద‌టి మంత్రి వ‌ర్గ స‌మావేశం జూన్ 24న జ‌రిగింది. ఈ స‌మావేశంలో బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్పుడు చేసిన మొద‌టి ఐదు సంతకాలు అంశాలకు ఆమోదం ల‌భించింది. మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు, పెన్ష‌న్ రూ.4 వేల‌కు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టం ర‌ద్దు, నైపుణ్య గ‌ణ‌న అంశాల‌కు మొద‌టి మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.

దీంతో అప్ప‌టి నుంచి మెగా డీఎస్సీపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏదీ ఏమైనా జూలై 1 నుంచి డిసెంబ‌ర్ నెలఖారులోపు  మెగా డీఎస్సీ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే అధికారులు ఏర్పాట్లు చ‌కచ‌క చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలు, వాటి భ‌ర్తీపై అధికారులు దృష్టి పెట్టారు. అందులో జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్, మున్సిప‌ల్ పాఠ‌శాల్లో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భ‌ర్తీ చేస్తూనే, రెసిడెన్షియ‌ల్‌, మోడ‌ల్ స్కూళ్లు, బీసీ, గిరిజ‌న స్కూళ్ల‌లో 2,281 ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ లేదా సోమవారం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

జిల్లాల వారీగా ఖాళీలు…

ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం 543, విజ‌య‌న‌గ‌రం, 583, విశాఖ‌ప‌ట్నం 1,134, తూర్పుగోదావ‌రి 1,346, ప‌శ్చిమ గోదావ‌రి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్ర‌కాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1,478, క‌డ‌ప‌, 709, అనంత‌పురం 811, క‌ర్నూలు 2,678 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెసిడెన్షియ‌ల్‌, మోడ‌ల్ స్కూళ్లు, బీసీ, గిరిజ‌న స్కూళ్ల‌లో 2,281 ఖాళీలు ఉన్నాయి. 16,347 పోస్టుల‌ను మెగా డీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.

మెగా డీఎస్సీలో పోస్టులు…

మెగా డీఎస్సీలో 16,347 పోస్టుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అందులో ఎస్‌జీటీ 6,371, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిప‌ల్స్ 52 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే ఇప్ప‌టికే టెట్ అర్హ‌త సాధించిన వారికి ఒక డీఎస్సీ నోటిఫికేష‌న్‌, ఇప్ప‌టి వ‌ర‌కు టెట్ అర్హ‌త సాధించ‌నివారికి టెట్‌తో పాటు డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తుంది. 

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.