Kapu Corporation Loans : సబ్సిడీపై కాపు కార్పొరేషన్ లోన్లు- దరఖాస్తు విధానం, అర్హతలు, పూర్తి వివరాలివే-ap kapu corporation loans subsidy details application process and eligibility ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kapu Corporation Loans : సబ్సిడీపై కాపు కార్పొరేషన్ లోన్లు- దరఖాస్తు విధానం, అర్హతలు, పూర్తి వివరాలివే

Kapu Corporation Loans : సబ్సిడీపై కాపు కార్పొరేషన్ లోన్లు- దరఖాస్తు విధానం, అర్హతలు, పూర్తి వివరాలివే

Kapu Corporation Loans : కాపు సామాజిక వర్గాల్లో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తుంది. చంద్రన్న స్వయం ఉపాధి, గ్రూప్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద 50 శాతం వరకు సబ్సిడీతో రుణాలు అందిస్తు్ంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

సబ్సిడీపై కాపు కార్పొరేషన్ లోన్లు- దరఖాస్తు విధానం, అర్హతలు, పూర్తి వివరాలివే

Kapu Corporation Loans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుంది. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు సబ్సిడీపై రుణాలు ఇస్తున్నారు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అర్హులైన వారు ఈ నెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రెండు విధాలుగా రుణాలు అందిస్తున్నారు.

1. చంద్రన్న స్వయం ఉపాధి

కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (APSKWDC) రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కాపు కులాల వారికి "ఆర్థిక సహాయ కార్యక్రమం- చంద్రన్న స్వయం ఉపాధి"లో భాగంగా రుణసదుపాయం అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 2,50,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సహాయం కొత్త వ్యాపారాలను స్థాపించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఉపయోగపడుతుంది.

  • ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామాజికవర్గంలోని ఆర్థికంగా బలహీన కుటుంబాలకు వర్తిస్తుంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ఎంటర్ ప్రైజెస్ సెటప్ చేయాలనుకునే వారు లేదా ప్రస్తుతం ఉన్న సంస్థను విస్తరించాలని కోరుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వీటికి ప్రతిపాదిత యూనిట్ ధర 3 స్లాబ్‌లలో ఉంటుంది.

స్లాబ్ 1:

➤ మీ యూనిట్ ధర రూ.2,00,000 వరకు అయితే దాని ఖర్చులో 50% వరకు గరిష్టంగా రూ. 1,00,000 బ్యాంకు నుంచి దరఖాస్తుదారుడు రుణం పొందవచ్చు.

స్లాబ్ 2:

➤ యూనిట్ ధర రూ.3,00,000 అయితే దాని ఖర్చులో 50% వరకు, గరిష్టంగా రూ. 1,50,000 వరకు బ్యాంకు నుంచి దరఖాస్తుదారుడు రుణంగా తీసుకోవచ్చు.

స్లాబ్ 3:

➤ యూనిట్ ధర రూ.5,00,000 వరకు అయితే దాని ఖర్చులో 50%, గరిష్టంగా రూ. 2,50,000 (రూ. రెండు లక్షల యాభై వరకు) రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది.

అర్హతలు

  • దరఖాస్తుదారుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. అంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు చెందిన వారై ఉండాలి.
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తుండాలి.
  • దరఖాస్తుదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబానికి చెందినవారై ఉండాలి.
  • దరఖాస్తుదారుడు ఏపీలో ఒక సంస్థను కలిగి ఉండాలి లేదా సెటప్ చేయడానికి ప్లాన్ చూపాలి.
  • ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారు వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • దరఖాస్తుదారుడు ఏ ఇతర ప్రభుత్వ పథకం/కార్యక్రమం కింద రుణం పొంది ఉండకూడదు.
  • గత ఆర్థిక సంవత్సరంలో లేదా గతంలో కాపు కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు అర్హులు కారు.

దరఖాస్తు విధానం, కావాల్సిన పత్రాలు

అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును APSKWDC వెబ్‌సైట్‌లో సూచించిన ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవాలి. ఈ https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

1. దరఖాస్తుదారు కుటుంబానికి చెందిన తెల్ల రేషన్ కార్డ్

2. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు

3. కుల ధృవీకరణ పత్రం

4. పుట్టిన తేదీ రుజువు

5. పాస్‌పోర్ట్ సైజు ఫొటో (50 KB పరిమాణం వరకు)

2. గ్రూప్ MSME ప్రోగ్రామ్

ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSKWDC) "గ్రూప్ MSME ప్రోగ్రామ్"ను ప్రారభించింది. ఈ కార్యక్రమం కింద నిర్ణీత ప్రక్రియ ద్వారా ఎంపికైన దరఖాస్తుదారులకు రూ. 1,000,000 (రూ. పది లక్షలు) ఆర్థిక సహాయం అందించనుంది. కొత్త ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రైజెస్‌ని స్థాపించడానికి 3 నుంచి 5 మంది సభ్యులు గ్రూప్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకోవచ్చు.

1. ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఖర్చు కనీసం రూ. 25,00,000 (రూ. ఇరవై ఐదు లక్షలు).

2. కార్పొరేషన్ ద్వారా రూ. 10,00,000 (రూ. పది లక్షలు) సబ్సిడీ అందిస్తారు.

3. ప్రాజెక్ట్ కోసం మార్జిన్ మనీ పరంగా లబ్ధిదారుల కనీసం రూ. 5,00,000 పెట్టుబడి కలిగి ఉండాలి.

4. సబ్సిడీ, లబ్ధిదారుల సహకారం తర్వాత మిగిలిన అవసరమైన బ్యాలెన్స్ బ్యాంక్ లోన్‌గా పొందవచ్చు. ఇది కనీసం రూ. 10,00,000కి సమానం.

అర్హతలు

  • ప్రతిపాదిత ప్రాజెక్టు గ్రూప్ లో 3-5 మంది సభ్యులు ఉండాలి.
  • దరఖాస్తుదారుల గ్రూప్ కాపు కమ్యూనిటీ అంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు చెందినవారై ఉండాలి.
  • గ్రూప్ సభ్యులందరూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తుండాలి.
  • గ్రూప్ లోని ప్రతి సభ్యుని ఆదాయ పరిమితి రూ. 8,00,000 మాత్రమే ఉండాలి.
  • ఈ గ్రూప్ ఒక సంస్థను స్థాపించడానికి ప్లాన్ చేయాలి.
  • ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో గ్రూప్ సభ్యులు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
  • గ్రూప్‌లోని సభ్యులు ఎవరైనా ఏ బ్యాంకుకు లేదా ఏదైనా ఆర్థిక సంస్థలకు డిఫాల్టర్లుగా ఉండకూడదు.
  • గ్రూప్‌లోని సభ్యులెవరైనా ఇదే ప్రయోజనం కోసం మరే ఇతర ప్రభుత్వ కార్యక్రమం కింద సాయం పొంది ఉండకూడదు.

దరఖాస్తు విధానం

అర్హత గల సభ్యులు తమ దరఖాస్తును https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లో నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

1. ఆదాయ ధృవీకరణ పత్రం

2. ఆధార్ కార్డ్

3. కుల ధృవీకరణ పత్రం

4. పుట్టిన తేదీ రుజువు

5. SSC ఉత్తీర్ణత సర్టిఫికేట్

6. పాన్ కార్డు

7. పాస్‌పోర్ట్ సైజు ఫొటో (JPEG ఫార్మాట్ లో 50 KB పరిమాణం వరకు)

8. గ్రూప్‌లోని సభ్యులందరి 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు.

9. ఆర్థిక అంశాలతో ప్రాజెక్ట్ నివేదిక

10. ప్రతి సభ్యుడు ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు డిఫాల్టర్ కాదని స్వీయ అఫిడవిట్ (ప్రభుత్వ అధికారిచే ధృవీకరించాలి).

11. మార్జిన్ మనీని ఏర్పాటు చేయడం గురించి సభ్యులందరి సంతకాలు

ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. బీసీ, ఈసీబీ వర్గాల దరఖాస్తులకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. అయితే కాపు లోన్ల దరఖాస్తులకు చివరి తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం