మోహన్ బాబు‌ యూనివర్సిటీకి జరిమానా, గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు.. ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు!-ap higher education commission imposes heavy fine to manchu mohan babu university in tirupati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మోహన్ బాబు‌ యూనివర్సిటీకి జరిమానా, గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు.. ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు!

మోహన్ బాబు‌ యూనివర్సిటీకి జరిమానా, గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు.. ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు!

Anand Sai HT Telugu

మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ జరిమానా విధించింది. అంతేకాదు గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు చేసింది.

మోహన్ బాబు

మంచు మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీకి పెద్ద షాక్ తగిలింది. మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా వేసింది ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజనల్ సర్టిఫికేట్లను నిలిపివేయడంలాంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యా కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ మెుత్తాన్ని యూనివర్సిటీ చెల్లించింది.

2022-23 నుంచి అంటే గత మూడేళ్ల నుంచి విద్యార్థుల దగ్గర ఫీజులు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇవి రూ.26 కోట్లపైన ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు యూనివర్సిటీపై విచారణ చేసిన ఉన్నత విద్యా కమిషన్ నిజమేనని నిర్ధారించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 కూడా తిరిగి చెల్లించాలని కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది.

విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లకుపైగా సొమ్మును 15 రోజుల్లో వారికి చెల్లించాలని చెప్పింది కమిషన్. అంతేకాదు యూనివర్సిటీ అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్‌సీహెచ్‌పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్‌కు కమిషన్ సిఫారసు చేసింది.

పేరెంట్స్ అసోసియేషన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నత విద్యా శాఖ అధికారులు విచారణ చేశారు. ఇందులో భాగంగానే మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో 26 కోట్లకుపైగా అదనంగా వసూలు చేశారని గుర్తించారు.

మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ. 2022లో శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా మారిన విషయం తెలిసిందే.

స్పందించిన మంచు విష్ణు

అయితే మీడియాలో వస్తున్న వార్తలపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలను ఉద్దేశించి ప్రకటన విడుదల చేస్తున్నామని తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఈ సిఫార్సులను వ్యతిరేకిస్తోందన్నారు. అవి కేవలం సిఫారసులు మాత్రమేనని చెప్పారు.

ఈ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉందని, కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా యూనివర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చిందని మంచు విష్ణు వెల్లడించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి.. దీనిని పోర్టల్‌లో పెట్టడం దురదృష్టకరమని, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ చేసిన సిఫారసులు సరికాదని మోహన్ బాబు యూనివర్సిటీ గట్టిగా విశ్వసిస్తోందన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.