AP High Court: అమరావతిలో రైతుల ఫ్లాట్లలో రోడ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
AP High Court: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ఫ్లాట్లలో ఏపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. రైతుల సమ్మతి లేకుండా ఏకపక్షంగా రోడ్ల నిర్మాణం తగదని, రైతుల వాదన పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.
AP High Court: అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూములు అప్పగించిన రైతులకు అప్పటి ప్రభుత్వం నివాస స్థలాలు కేటాయించింది. ఇటీవల ఆ ఫ్లాట్లలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేపట్టడంపై వివాదం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్లలో ఏకపక్షంగా రహదారి పనులు చేపడుతున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతికి భూ సమీకరణలో భూమిలిచ్చిన రైతులకు చెందిన నివాస ప్లాట్లలో సీఆర్‌డీఏ, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రహదారి నిర్మాణ పనులు చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పట్టింది.
నిడమర్రు-బేతపూడి రహదారి పనులను తక్షణం నిలిపేయాలని ఆదేశించింది. రైతులకు నోటీసులు ఇవ్వకుండా, వారి అనుమతి లేకుండా వారి ప్లాట్లలో రహదారి నిర్మాణం ఎలా చేపడతారంటూ అధికారులను ప్రశ్నించింది.
రోడ్ల నిర్మాణం చేపట్టాలంటే రైతులకు నోటీసులిచ్చి వారి వైఖరి తెలుసుకోవాలని స్పష్టం చేసింది. భూములు సేకరించాలంటే సీఆర్‌డీఏ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రాజధాని అమరావతి కోసం భూమి ఇచ్చినందుకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామ పరిధిలో 960 చ.గజాల రెసిడెన్షియల్ ప్లాటు కేటాయించారని, ఆ భూమిలో అధికారులు ఏకపక్షంగా రహదారి ఏర్పాటు చేస్తున్నారని అనపర్తి సునీత తరఫున ఆమె తండ్రి ఉప్పుటూరి శివనాగేశ్వరరావు హైకోర్టులో సోమవారం లంచ్‌మోషన్ దాఖలు చేశారు.
తమ ప్లాట్‌లో రోడ్డు నిర్మాణం చేపట్టకుండా అధికారులకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తు రోడ్డు పనులు చేపట్టారని కోర్టుకు ఫిర్యాదు చేశారు.
రైతులకు చెందిన ప్లాట్లలో ఏకపక్షంగా రహదారి పనులు ప్రారంభించారన్నారు. హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పట్టించుకోవడం లేదని, రైతులకు నోటీసు ఇవ్వలేదన్నారు. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బేతపూడి రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేశారు. అధికారులు నిబంధనలను పాటించాల్సిందేనని, నోటీసులు ఇవ్వకుండా పనులు చేయొద్దని ఆదేశించారు. సీఆర్‌డీఏ కమిషనర్, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు.