R5 Zone Highcourt Stay: అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే…-ap high court stay on construction of houses in amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Ap High Court Stay On Construction Of Houses In Amaravati

R5 Zone Highcourt Stay: అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే…

HT Telugu Desk HT Telugu
Aug 03, 2023 11:11 AM IST

R5 Zone Highcourt Stay: అమరావతిలో విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మించాలనే ప్రయత్నాలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే
ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే

R5 Zone Highcourt Stay: అమరావతి మాస్టర్‌ ప్లాన‌లో ఎలక్ట్రానిక్ సిటీగా పేర్కొన్న ప్రాంతంలో ఆర్‌5 జోన్‌ పేరిట పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను హైకోర్టు తప్పు పట్టింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అమరావతిలో 25 లే ఔట్లలో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి మాత్రమే అనుమతించిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు ఉత్తర్వులకు లోబడి తీర్పు ఉంటుందని స్పష్టం చేసిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది. సుప్రీం కోర్టులో అమరావతి రైతుల హక్కులకు సంబంధించిన వివాదాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది.

మరోవైపు అమరావతిలో గత నెలలో 50వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన దాదాపు 50వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. అవే స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు జులై 24వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో రైతులకు చట్టబద్దంగా.. వారి వాటాలు కేటాయించకుండా అవే భూముల్ని పేదలకు పెంచడాన్ని రైతులు సవాలు చేశారు.

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల్లో దాదాపు 28వేల ఎకరాల భూమిని పేద, సన్నకారు రైతుల నుంచి సేకరించారని, ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా మాస్టర్‌ ప్లాన్‌ కు మార్పులు చేస్తూ కొత్తగా ఆర్‌5 జోన్ ఏర్పాటు చేసి అందులో ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని రైతులు తప్పు పట్టారు.

జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ మానవేంద్రరాయ్‌‌లతో కూడిన ధర్మాసనం.. ఇళ్ల స్థలాల కోసం 1402 ఎకరాల భూమి కేటాయింపును తప్పు పట్టింది. తక్షణం ఇళ్ల నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు R-5 జోన్ ఏర్పాటుతో పాటు 1,402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు వివాదాలు పరిష్కరించామన్న సిఎం….

గత నెల 24న రాజధాని ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వివాదాల్ని పరిష్కరించి పేదలకు ఇళ్ల స్థలాల్ని కేటాయించి ఇళ్లను నిర్మిస్తున్నామని ప్రకటించారు. పెత్తందారుల రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని సామాజిక అమరావతిగా మారుస్తూ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో 1400ఎకరాల్లో 50వేల ఇళ్ల నిర్మాణానికి సిఎం జగన్ జులై 24న శంకు స్థాపన చేశారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని సిఎం జగన్‌ గతవారం చెప్పారు. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత, ఎన్నో అవరోధాలను అధిగమించి సాధించిన విజయంతో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇళ్ళు కట్టించి ఇవ్వకుండా చంద్రబాబు, మీడియా సంస్థలు, దత్తపుత్రుడు అడ్డుపడ్డారని సిఎం జగన్ శంకుస్థాపన సందర్భంగా ఆరోపించారు.

పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం రాకూడదని హైకోర్టులో 18కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేశారని వివరించారు. మూడేళ్లుగా కోర్టుల్లో వేసిన కేసులు పరిష్కరించేందుకు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. చివరకు దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులతో హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం గెలిచి ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోవడంతో, ఆ తర్వాత ఇళ్లు నిర్మించకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారని, కేంద్రంలో ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కేంద్ర మంత్రలు, సెక్రటరీలను కలిశారని, చివరకు హైకోర్టులో కేసులు వేశారని, వాటిని పరిష్కరించి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రోజుల వ్యవధిలోనే ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా, ప్రధాన పిటిషన్లు డిసెంబర్‌కు వాయిదా పడిన నేపథ్యంలో వాటితో కలిపి విచారణ జరగవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.

WhatsApp channel