AP High Court : ఖైదీల విడుదలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం….-ap high court questions orders of prisoners released by government ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Questions Orders Of Prisoners Released By Government

AP High Court : ఖైదీల విడుదలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం….

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 06:58 AM IST

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, ఖైదీల విడుదలపై అమలులో ఉన్న నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా ఖైదీలను విడిచిపెట్టడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖైదీల విడుదలపై పూర్తి వివరాలను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఖైదీల విడుదలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఖైదీల విడుదలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుల్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్షమాభిక్ష మంజూరు చేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలను విడుదల చేశారంటూ హత్యకు గురైన మృతుడి భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఏ నిబంధనల మేరకు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించారని ప్రశ్నించింది.

ట్రెండింగ్ వార్తలు

హత్య కేసులో జీవిత ఖైదు పడిన నిందితులకు కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి కాకుండా విడుదల చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖైదీల విడుదలలో ఉన్న నిబంధనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఖైదీలను ఎలా విడుదల చేశారని నిలదీసింది. కనీసం 14ఏళ్ల జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్న వారిని మాత్రమే క్షమాభిక్షకు అర్హులుగా గుర్తించాల్సి ఉన్నా, శిక్షను కుదించి ఖైదీలను విడిచిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన పార్థమరెడ్డిని హత్య చేసిన ఎనిమిది నిందితులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై విడుదల కావాడాన్ని సవాలు చేస్తూ మృతుడి భార్య ముడి నవనీతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ విచారణ జరిపారు. గత ఏడాది నిందితులు విడుదలయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో హైకోర్టు అభ్యంతరంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ ఏడాది బయటకు రావడంతో తిరిగి కోర్టును ఆశ్రయించారు. ఏడాది తర్వాత నిందితులు పూర్తి శిక్షలను అనుభవించ కుండానే బయటకు రావడంపై కోర్టును ఆశ్రయించారు. గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌కు అనుబంధంగా మరో పిటిషన్ వేశారు. క్షమాభిక్షతో బయటకు వచ్చిన ఎనిమిది మంది నిందితులలో కొందరు ఎనిమిదేళ్లు, మరికొందరు 11ఏళ్లు మాత్రమే శిక్షలు పూర్తి చేసుకున్నారు. దీంతో నిందితుల్ని తిరిగి జైలుకు పంపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ క్షమాభిక్షపై విడుదలైన పుచ్చలపల్లి నరేశ్‌రెడ్డి, కొండూరు దయాకర్ రెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి, పుచ్చలపల్లి నిరంజన్ రెడ్డి, పుచ్చలపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెన్నూరి వెంకటరమణారెడ్డిలను జైలుకు పంపాలని పిటిషనర్ అభ్యర్థించారు.

కనీసం 14ఏళ్ల శిక్షలు పూర్తి కాకుండా నిందితులకు క్షమాభిక్షలు ప్రసాదించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌ అధికారాల మేరకు ఖైదీల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన హైకోర్టు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించారా లేదా అని ప్రశ్నించింది. జీవిత ఖైదు పడిన వారు కనీసం 14ఏళ్ల శిక్ష అనుభవించాలని,సత్ప్రవర్తన కలిగి ఉంటేనే క్షమాభిక్షకు అర్హులని గుర్తు చేశారు. ఖైదీల విడుదలపై పూర్తి వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని, పూర్తి స్థాయి వాదనలకు సిద్ధమై శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

IPL_Entry_Point

టాపిక్