AP High Court : ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అధికారుల అభ్యంతరాలు తగవు…హైకోర్టు-ap high court orders on kurnool district nandyala medical college land allocation orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Orders On Kurnool District Nandyala Medical College Land Allocation Orders

AP High Court : ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అధికారుల అభ్యంతరాలు తగవు…హైకోర్టు

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 08:33 AM IST

AP High Court నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుపై దాఖలైన కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయంపై శాఖాధిపతి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని, భూమి బదలాయింపు ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టినప్పుడు అందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించింది. వ్యవసాయ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించిన 500ఎకరాలలో మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాలను బదలాయించి, మరో చోట 50 ఎకరాలు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP High Court నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వైద్య కళాశాల ఏర్పాటు కోసం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన భూమిలో 50 ఎకరాలను ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ వర్సిటీ గత ఏడాది తీర్మానం చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. వ్యవసాయ పరిశోధనా కేంద్రం భూములను వైద్య కళాశాల కోసం బదలాయించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం కాదని తేల్చిచెప్పింది.

ట్రెండింగ్ వార్తలు

వ్యవసాయ పరిశోధనతో ముడిపడి ఉన్న ప్రజాప్రయోజనాల కంటే వైద్య కళాశాల ఏర్పాటుతో ఎక్కువ ప్రజాప్రయోజనాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధాన నిర్ణయం తీసుకున్న తరువాత శాఖాధిపతి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వైద్య కళాశాల ఏర్పాటు చేయడం కోసం, ప్రజా ప్రయోజనార్థం క్యాబినెట్‌ స్థాయిలో భూమిని కేటాయించిన తరువాత ఆ విధాన నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రభుత్వం కింద పనిచేసే అధికారి చెప్పలేరని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయాలను శాసించేందుకు అధికారులకు అనుమతించలేమని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఇతర భూములు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వ్యవసాయ వర్సిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరథ రామిరెడ్డితో పాటు మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం 'ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపింది.

నంద్యాలలో ఎక్కడా వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైన భూమి లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రం భూమిని తీసుకోవాల్సి వచ్చిందని, వైద్య కళాశాల కోసం తీసుకున్న 50 ఎకరాల భూమిని వ్యవసాయ పరిశోధన కోసం మాత్రమే కేటాయించారన్న పిటిషనర్ల వాదన సరికాదని చెప్పింది. 2015లోనే వ్యవసాయ వర్సిటీకి 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా, వైద్య కళాశాల కోసం తీసుకుంటున్న 50 ఎకరాలకు బదులుగా మరో 50 ఎకరాలను అదనంగా ప్రభుత్వం కేటాయించిన సంగతి ప్రస్తావించింది.

ప్రజలకు తగిన వైద్య సదుపాయం కల్పించడం సమాజ మౌలిక అవసరమని, ప్రతి ప్రభుత్వం కూడా ఇందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు జోక్యం చేసుకోవాల్సినంత ప్రజాప్రయోజనాలు వ్యాజ్యాలలో లేవని పేర్కొంది. దీంతో పాటు కొత్త కలెక్టరేట్‌ కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రం భవనాలను వినియోగించుకోవడంపై దాఖలైన పిల్‌ను సైతం హైకోర్టు కొట్టేసింది. అందుబాటులో ఉన్నందున భవనాలను వినియోగించుకుంటున్నందున ఆ వ్యాజ్యాలను తోసిపుచ్చింది.

IPL_Entry_Point

టాపిక్