AP HC On Rushikonda Digging: చేతులు కలిపినట్లు ఉంది..!ఇక మేమే కమిటీని నియమిస్తాం-ap high court key comments on rushikonda digging in vizag ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap High Court Key Comments On Rushikonda Digging In Vizag

AP HC On Rushikonda Digging: చేతులు కలిపినట్లు ఉంది..!ఇక మేమే కమిటీని నియమిస్తాం

HT Telugu Desk HT Telugu
Dec 21, 2022 04:56 PM IST

Rushikonda Digging in Vizag: రుషికొండలో తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై అసహనం వ్యక్తం చేస్తూ... పనులను పరిశీలించేందుకు తామే ఓ కమిటీని నియమిస్తామని హెచ్చరించింది.

రిషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రిషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు (aphc)

AP High Court Comments On Rushikonda digging: రుషికొండలో తవ్వకాలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పనులను పరిశీలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై అసహనం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కమిటీపై ఉన్న అభ్యంతరాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్లను న్యాయస్థానం ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

గతంలో విచారించిన హైకోర్టు... రుషికొండలో జరుగుతున్న తవ్వకాలు, పనులపై కమిటీని నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీ నియమించాలని స్పష్టం చేయగా... కేంద్రం మాత్రం రాష్ట్ర అధికారులతోనే కమిటీ నియమించింది. దీనిపై పిటిషనర్ తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన కోర్టు... పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. తాజాగా కమిటీ సభ్యుల నియామకాన్ని సమర్థిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. విచారణ జరిపి తామే ఓ కమిటీని నియమిస్తామని వ్యాఖ్యానించింది. కేంద్రం తీరు చూస్తుంటే.. రాష్ట్రంలో చేతులు కలిపినట్లు ఉందంటూ సీరియస్ అయింది. మరోవైపు గురువారం ఉదయమే విచారిస్తామని తెలుపుతూ... కేసును రేపటికి వాయిదా వేసింది.

రుషికొండ వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్ట్ పనులను చేపడుతోంది. . అక్కడ టూరిజంకు సంబంధించిన పెద్ద హోటల్ కట్టే దిశగా అడుగులు వేస్తోంది. అయితే పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్జీటీ కూడా పలు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. విచారణలో అనుమతి ఇచ్చిన దాని కన్నా మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది. కానీ అంతకు మించి తవ్వారని పిటిషనర్లు వాదించడంతో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే నిర్వహిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని విపక్షాలు అంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయటాన్ని సీరియస్ గా పరిగణించిన హైకోర్టు... గురువారం ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point