రాష్ట్రంలోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ సర్క్యులర్ ఇచ్చింది. సోషల్‌మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని ప్రస్తావించింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసుల్లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పును అనుసరించాలని స్పష్టం చేసింది.
ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌లను అన్ని కోణాల్లో పరిశీలించాలని స్పష్టం చేసింది. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా..?లేదా…? అనేది క్షుణ్ణంగా చూడాలని పేర్కొంది. మెజిస్ట్రేట్‌లు కచ్చితంగా ఈ సర్క్యులర్ ను అమలు చేయాలని ఆదేశించింది.
భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛగా అభిప్రాయాలను చేసే విషయంలో ‘క్రిమినల్ లా’ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ ఏడాది మార్చి 28న ‘ఇమ్రాన్ ప్రతాప్ గాందీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలక ఇచ్చిందని సర్కులర్ లో ప్రస్తావించింది. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లకు సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే ముందు సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలించాలని పేర్కొంది.
కేసుకు సంబంధించిన అన్ని వివరాలపై సంతృప్తి చెందాకే రిమాండ్‌కు పంపే విషయంలో మెజిస్ట్రేట్లు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు విడుదల చేసిన సర్కులర్ లో ఉంది. సర్క్యులర్‌లోని సూచనలను మెజిస్ట్రేట్లందరూ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. తమ సూచలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు పేర్కొంది.