Ram Gopal Varma : రామ్‌గోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు.. షరతులు వర్తిస్తాయి!-ap high court grants anticipatory bail to ram gopal varma ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ram Gopal Varma : రామ్‌గోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు.. షరతులు వర్తిస్తాయి!

Ram Gopal Varma : రామ్‌గోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు.. షరతులు వర్తిస్తాయి!

Ram Gopal Varma : ఫేమస్ డైరెక్టర్ ఆర్జీవీకి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు మందస్తు బెయిల్ మంజూరు చేసింది. రామ్‌గోపాల్‌ వర్మపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన చాలా రోజులుగా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆర్టీవీకి బెయిల్ మంజూరు చేసింది.

రామ్‌గోపాల్‌ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆర్జీవీకి అన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. అదే సమయంలో.. విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ రావడంతో.. ఆర్జీవీకి ఊరట దక్కింది. చాలా రోజులుగా ముందస్తు బెయిల్ కోసం రామ్‌గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారు.

రామ్‌గోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడే కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి.

కేసులు వద్దంటూ..

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌‌పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో.. తనపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరుతూ.. రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో.. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేశారు.

వర్మ డెన్‌కు పోలీసులు..

మద్దిపాడులో నమోదైన కేసుకు సంబంధించి.. హైదరాబాద్‌లోని వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు నవంబర్ 25న వెళ్లారు, వర్మను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. అయితే.. పోలీసులు రావడానికి ముందు వర్మ మాయం అయినట్టు వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ నిమిత్తం తాను వేరేచోట ఉన్నానని వర్మ స్పష్టం చేశారు.

వైసీపీకి సపోర్ట్‌గా..

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ.. ఎన్నికలకు ముందు జగన్‌కు సపోర్ట్‌గా చాలా పోస్టులు పెట్టారు. వైసీపీకి చెందిన కీలక నేతలను ఇంటర్వ్యూ కూడా చేశారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద్ రెడ్డి మర్డర్ గురించి స్పెషల్ ఎపిసోడ్‌లు చేశారు. అలాగే వ్యూహం సినిమాను జగన్‌కు సపోర్ట్‌గా తీశారు. పలు సందర్భాల్లో జగన్‌ను కూడా కలిశారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకష్, పవన్ కల్యాణ్, నాగబాబుపై వర్మ సంచలన ట్వీట్లు చేశారు.