ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) మోడల్‌లో 10 వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి పోటీ బిడ్డింగ్ ప్రక్రియపై మధ్యంతర స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ నమూనాలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలని విధాన నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని తప్పుపట్టలేమని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని హైకోర్టు తెలిపింది.
తాడేపల్లికి చెందిన కుర్ర వసుంధర అనే మహిళ పది వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో పనులను నిలిపివేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారని, రూ.5,008 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్ దీనికి నిధులు అందించడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కారణాలు చెప్పకుండానే పనులను నిలిపివేసిందని శ్రీరామ్ వాదించారు. ప్రభుత్వం ఎక్కడా నిధుల కొరత గురించి ప్రస్తావించలేదని వాదనలు వినపించారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్ కోసం పనులను నిలిపివేయడంలో, టెండర్లను పిలవడంలో ప్రక్రియను అనుసరించలేదని శ్రీరామ్ అన్నారు.
నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్‌లోకి వెళ్లాలని విధాన నిర్ణయం తీసుకొని ఉండవచ్చని ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు పరిపాలన అనుమతులు మాత్రమే ఇస్తే సరిపోతుందా? నిధులు విడుదల చేయలేదు కదా అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే అయితే పీపీపీ మోడల్‌లో వెళ్లడంలో తప్పేముందని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ రకమైన పిటిషన్ దాఖలు చేయడం ద్వారా, పిటిషనర్లు ఒక విధంగా పేద ప్రజలకు మెరుగైన సేవలను అందించకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ దశలో టెండర్ ప్రక్రియపై మధ్యంతర స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
టాపిక్