AP Heatwave Alert : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాగల రెండు రోజుల వెదర్ రిపోర్ట్ ఇచ్చింది. రేపు(సోమవారం) రాష్ట్రంలోని 35 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 167 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి(మంగళవారం) 25 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 89 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
సోమవారం శ్రీకాకుళం జిల్లా 8, విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురంమన్యం 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు (35) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 167 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం-16, విజయనగరం-10, మన్యం-3, అల్లూరి -9, విశాఖ-2, అనకాపల్లి-16, కాకినాడ-15, కోనసీమ-9, తూర్పుగోదావరి-19, పశ్చిమగోదావరి-3, ఏలూరు-13, కృష్ణా-10, ఎన్టీఆర్-8, గుంటూరు-14, బాపట్ల-1, పల్నాడు-19 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఆదివారం అనకాపల్లి జిల్లా నాతవరంలో 42.1°C, నంద్యాల జిల్లా రుద్రవరం, విజయనగరం జిల్లా పెదనదిపల్లిలో 41.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. డీహైడ్రేషన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. రేపు(సోమవారం) ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 20వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని, 21వ తేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సంబంధిత కథనం