Health Minister: వరదలొచ్చిన వారానికి వచ్చిన ఏపీ వైద్యశాఖ మంత్రి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన-ap health minister who came in the week of floods visited the flood affected areas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Health Minister: వరదలొచ్చిన వారానికి వచ్చిన ఏపీ వైద్యశాఖ మంత్రి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

Health Minister: వరదలొచ్చిన వారానికి వచ్చిన ఏపీ వైద్యశాఖ మంత్రి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

HT Telugu Desk HT Telugu
Sep 08, 2024 12:37 PM IST

Health Minister: ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖమంత్రి సత్యకుమార్‌ యాదవ్ కృష్ణా, బుడమేరు వరదలు ముంచెత్తిన వారం రోజులకు విజయవాడ వచ్చారు. వరదసహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆగస్టు 30వ తేదీ నుంచి విజయవాడ నగరం భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుంటే మంత్రి వారం రోజుల తర్వాత విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు.

బుడమేరు వరద ముంపు బాధితుల్ని శనివారం పరామర్శిస్తున్న మంత్రి సత్యకుమార్
బుడమేరు వరద ముంపు బాధితుల్ని శనివారం పరామర్శిస్తున్న మంత్రి సత్యకుమార్

Health Minister: కృష్ణానదికి వరదలు వచ్చి సరిగ్గా వారం రోజులు అయింది. 30 31వ తేదీల్లో భారీ వర్షం కుయటంతో కృష్ణ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఎగువ కృష్ణతో పాటు బుడమేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.

పశ్చిమ కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొరియడంతో బుడమేరు పరివాహక ప్రాంతానికి భారీగా వరద పోటెత్తింది. ఫలితంగా గత వారం రోజులుగా విజయవాడ నగరంలోని సగం ప్రాంతం ముంపులో ఉంది. మరోవైపు ఆగస్టు28న ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది.

క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఏపీలో భారీ వర్షాలు కురిసే సమయానికే వైద్యశాఖ మంత్రి విదేశీ పర్యటకు వెళ్ళినట్టు చెబుతున్నారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసేవల్ని పర్యవేక్షించే బాధ్యత ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పైనే పడింది.

సంబంధిత శాఖ మంత్రి లేకుండానే వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలు వారం రోజులుగా నిర్వహించారు. సత్య కుమార్ వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళుతున్నట్టు గత నెల 29వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వరద ప్రారంభమైన వారం రోజుల తర్వాత మంత్రి విజయవాడ చేరుకున్నారు . నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితుల్ని పరామర్శించారు. మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లే సమయానికి ఆంధ్రప్రదేశ్ కి తుఫాను పొంచి ఉందని హెచ్చరికలు ఉన్నాయి.

ఏపీలో సంకీర్ణ ఉన్న ప్రభుత్వంలో బీజేపీ-జనసేనలు భాగస్వాములుగా ఉన్నాయి. చివరి క్యాబినెట్‌ సమావేశం తర్వాత డిప్యూటీ సిఎం 3వ తేదీ వరకు అందుబాటులో లేరని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వరద సహాయ చర్యలకు అటంకం కలగకూడదనే తాను రాలేదని పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు

బిజెపి మంత్రి సత్య కుమార్ వ్యక్తిగత పనుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక చర్యల్లో బీజేపీ నాయకులు కొంత వెనుకబడినట్టు కనిపిస్తోంది. వరద సహాయక చర్యలన్నీ టీడీపీ మంత్రులు కేంద్రంగానే సాగుతున్నాయి.

ఎన్డీఏ కూటమిలో బీజేపీ నేతల టిడిపి నాయకత్వానికి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. బీజేపీ నాయకులు కూడా వరద సహాయక చర్యలపై సకాలంలో స్పందించలేదని విమర్శలు ఉన్నాయి.

28వ తేదీన క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం కూడా క్యాబినెట్ భేటీలో పాల్గొన్నారు. సెప్టెంబర్ రెండవ తేదీన పుట్టినరోజు ఉండటంతో తాను అందుబాటులో ఉండనని పవన్ కళ్యాణ్ ముందే మంత్రులు స్పష్టం చేశారు. 30, 31 తేదీల్లో విజయవాడ నగరం భారీ వర్షాలు వరదలతో అతలాకుతలవైంది.

పవన్ కళ్యాణ్ వరదలు ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత విపత్తు సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద బాధితులను ఆదుకోడానికి వ్యక్తిగతంగా సంక్షేమ నిధిని కూడా ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయితీకి లక్ష రుపాయల చొప్పున 400గ్రామాలకు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 'తాను పర్యటించాలని అనుకున్నా, తన వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు" అని పవన్ కళ్యాణ్‌ వివరణ ఇచ్చారు. తన పర్యటన సహాయపడేలా ఉండేలా తప్ప అదనపు భారం కాకూడదని, తాను రాలేదని కొందరు నిందలు వేస్తారని అంతే తప్ప ఇంకేం ఉండదనిచెప్పారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవ చేయడమే ముఖ్యం' అని పవన్ వెల్లడించారు.