Curruption : ప్రొబేషన్ ఖరారైనందుకు అమ్యామ్యాలు….-ap gsws employees complaints about bribes for salary payments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Gsws Employees Complaints About Bribes For Salary Payments

Curruption : ప్రొబేషన్ ఖరారైనందుకు అమ్యామ్యాలు….

B.S.Chandra HT Telugu
Aug 06, 2022 07:14 AM IST

నిన్న మొన్నటి వరకు ప్రొబేషన్ ఎప్పుడు ఖరారవుతుందా అని ఎదురు చూసిన సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడు బిల్లులు పాస్ చేసినందుకు చేతులు తడపాలని ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. లంచాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని హెచ్చరికలతో భయపెట్టి వసూలు చేస్తున్నారు.

కొత్త జీతాలొచ్చాయి, లంచాలివ్వాలని సచివాలయ సిబ్బందికి ఒత్తిళ్లు…
కొత్త జీతాలొచ్చాయి, లంచాలివ్వాలని సచివాలయ సిబ్బందికి ఒత్తిళ్లు…

ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. పాలనను ప్రజల గడపల్లోకి తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత నెలలో వారి ప్రొబేషన్‌ పూర్తి చేసుకుని తొలిసారి పూర్తి స్థాయి వేతనాలు ఆగష్టులో అందుకున్నారు. ఇన్నాళ్లు చాలీచాలని జీతాలతో నెట్టకొచ్చిన సచివాలయ ఉద్యోగులకు పూర్తి జీతం అందుకుంటున్నామనే సంతోషం లేకుండా పోయింది. బిల్లులు తయారు చేసి జీతాలు ఖాతాల్లో పడినందుకు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 నుంచి వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల బిల్లుల్ని అమోదింపచేసుకోవడం కోసం సంబంధిత శాఖలకు మామూళ్లు చెల్లించుకోవడం సాధారణ వ్యవహారమే అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగుల సంఘాల నాయకుల సూచనలతో ఉద్యోగులు జీతాలు వచ్చిన సంతోషంలో తోచినంత సమర్పించుకుంటున్నారు. రూ.500కు తక్కువ కాకుండా బిల్లులు తయారు చేసిన వారి ద్వారా పైకి పంపుతున్నారు. ఉద్యోగుల జీతాలను అమోదించిన ట్రెజరీ శాఖ ద్వారా ఎక్కువమందికి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. చాలా జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులు జీతాల చెల్లింపుకు లంచాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో ఖరారు కావాల్సిన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ దాదాపు ఎనిమిది నెలల ఆలశ్యంగా జులైలో కొలిక్కి వచ్చింది. ఆగష్టు నుంచి వారికి పూర్తి స్థాయి వేతనాలు జమ అయ్యాయి. ఉద్యోగులు కొత్త వేతనాలకు అందుకోవడం ఖరారైనప్పటి నుంచి వారికి మామూళ్ల కోసం ఒత్తిళ్లు మొదలైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఖజానా కార్యాలయాల్లో ఉద్యోగుల జీతాల ప్రక్రియ పూర్తి చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు రూ.500తక్కువ కాకుండా వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారైంది. ఇలా ఎన్ని కోట్ల రుపాయలు లంచాలుగా వసూలు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో మొదటి జీతం వచ్చాక ఇస్తామని మాట్లాడుకున్నారు. ఒకటో తేదీ నుంచి జీతాల చెల్లింపు మొదలు కావడంతో లంచాల కోసం ఒత్తిళ్లు మొదలయ్యాయి. మండల పరిషత్ కార్యాలయాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో సచివాలయ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఉద్యోగులు బలవంతంగా వసూళ్లు చేస్తున్నారు.

ప్రొబేషన్ ఖరారైన ఉద్యోగులు, కొత్త జీతం అందుకున్న తర్వాత అందులో లంచం చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.500-1000 వసూలు చేస్తే తాము ఎలా బతకాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్యాలయానికి సిబ్బంది ఫిర్యాదుచ చేస్తున్నారు. లంచం అడిగితే 14400 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగుల్ని లంచాల కోసం వేధించడం చర్చనీయాంశంగా మారింది.

IPL_Entry_Point

టాపిక్